ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అధికార నివాసం మరమ్మతుల కోసం కోట్లాది రూపాయల ప్రజాధనం వెచ్చించారని భారతీయ జనతా పార్టీ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పడు దానికి వెచ్చించిన వ్యయంపై దర్యాప్తు జరిపే బాధ్యతలను కంప్ట్రోలర్,ఆడిటర్ జనరల్( కాగ్)కు అప్పగించినట్లు తెలుస్తోంది.
ఈ పునరుద్ధరణలో భాగంగా పరిపాలన, ఆర్థికపరమైన అవినీతిపై కాగ్ ప్రత్యేక ఆడిట్ నిర్వహించనున్నట్లు సమాచారం. ఢిల్లీ లెఫ్టెనెంట్ గవర్నర్ వికె సక్సేనా రాసిన లేఖ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ ప్రత్యేక ఆడిట్‌కు ఆదేశించినట్లు తెలుస్తోంది.
ఆ భవన పునరుద్ధరణలో తీవ్రస్థాయిలో ఆర్థిక అవకతవకలు చోటు చేసుకున్నట్లు ఆ లేఖలో తీవ్రస్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ భవనం మరమ్మతుల కోసం మొదట 15 కోట్లనుంచి 20 కోట్ల వరకు ఖర్చవుతుందని మొదట అంచనా వేశారని, తర్వాత అది రూ.52 కోట్లకు చేరుకుందని ఆ లేఖలో ఆరోపించారు.
ఈ విపరీత వ్యయం కోవిడ్ మహమ్మారి తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు సిఎం మేడమ్( కేజ్రీవాల్ సతీమణి) సూచన మేరకు జరిగినట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. మే 24న ఎల్జి కార్యాలయంనుంచి హోం శాఖకు ఈ లేఖ చేరినట్లు తెలుస్తోంది.
రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నిజాయితీ, నిరాడంబరత గురించి మాట్లాడిన వ్యక్తిప్పుడు తనను మహరాజులాగా భావిస్తున్నారని ఈ ఇంటి మరమ్మతుల విషయంపై బిజెపి విమర్శలు గుప్పిస్తోంది. ఈ విషయాలు బైటపెట్టకుండా ఉండేందుకు కేజ్రీవాల్ మీడియా సంస్థలకు రూ. 20 నుంచి రూ. 50 కోట్లు ఆఫర్ చేసినట్లు కూడా ఆ పార్టీ ఆరోపించింది.