బంగ్లా యుద్ధం – 14
1971లో పాకిస్థాన్ పై జరిగిన యుద్ధంలో భారత దేశం విజయం సాధించడమే కాకుండా, బంగ్లాదేశ్ పేరుతో ఒక కొత్త దేశం అవతరించడానికి సహకరించడం అపూర్వమైన, చారిత్రాత్మక పరిణామం అనడంలో సందేశం లేదు. ఈ యుద్ధం జరిగిన 50 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుపుకొంటున్నాము.
ఇదే సమయంలో మనం స్వాతంత్య్రం పొంది 75 ఏళ్ళు అవుతున్న సందర్భంగా కూడా పెద్ద ఎత్తున సంబరాలకు సిద్దపడుతున్నాము. ఈ 75 ఏళ్ళ చరిత్రలో ఒక అపూర్వమైన మజిలీ ఈ యుద్ధం అని చెప్పవచ్చు. భారత సైన్యం అంతటి నిర్ణయాత్మకమైన విజయం సాధించిన యుద్ధం మరొకటి లేదు. మరో దేశం భూభాగంలోకి చొచ్చుకుపోయి యుద్ధం చేసిన మరో సందర్భం కూడా లేదు.
కేవలం సైనిక ఎత్తుగడలలోనే కాకుండా రాజకీయ, దౌత్య అంశాలలో సహితం భారత్ ఒక విధమైన సాహసాన్ని ప్రదర్శించింది. స్పష్టమైన రాజకీయ, సైనిక వ్యూహం ఈ విజయానికి కారణం కావచ్చు. వారే ఈ మొతం విజయం ఘనతకు బాధ్యులమని మన ముందుండవచ్చు. అయితే ఇది మొత్తం జాతి సమిష్టి కృషి ద్వారా సాధ్యమయింది.
కానీ కేవలం పది నెలల కాలంలో రాజకీయ, సైనిక నాయకత్వం ప్రదర్శించిన సౌర్య, పరాక్రమాలు ఈ విజయానికి కారణం అని చెప్పలేము. ఒక విధంగా 75 ఏళ్లలో మన దేశంపై కళంక ప్రాయంగా మారిన 1962లో చైనాపై ఓటమి తర్వాత వరుసగా జరిగిన పరిణామాలు ఈ విజయానికి దారితీశాయని చెప్పవచ్చు.
ఆ పరాజయంకు కారణమైన మన పొరపాట్లు, లోపాలను రాజకీయ, సైనిక నాయకత్వం తీవ్రంగానే పరిగణించింది. అటువంటి పరిస్థితులను సరిదిద్దడం కోసం విశేషమైన ప్రయత్నం చేసింది. ఆ తర్వాత మన నాయకత్వం ఆలోచనలో పూర్తి మార్పు వచ్చింది. అందుకు తగ్గట్టుగా సైనిక శిక్షణ, యుద్ధ పరికరాలను సమకూర్చుకోవడం పట్ల దృష్టి సారించారు.
1962 నుండి ప్రారంభించి పెద్ద ఎత్తున సైనిక సంస్కరణలను అమలులోకి తీసుకు వచ్చారు. ఆ తర్వాత 1965లో పాకిస్థాన్ తో జరిగిన యుద్ధం సందర్భంగా ఎదురైన సవాల్ మనం చేపట్టిన సంస్కరణలకు ఒక పరీక్షగా, మజిలీగా మారింది. ఆ సందర్భంగా గ్రహించిన అనుభవాలు, గుణపాఠాలు ఆసరా చేసుకొని ఎన్నో మార్పులు, చేర్పులు జరిగాయి.
1962 నుండి సైనిక సంస్కరణలు
మరెన్నడు లేని విధంగా దేశ రక్షణకు బడ్జెట్ కేటాయింపులు పెరుగుతూ వచ్చాయి. 1962 నుండి 1971 వరకు జిడిపిలో 3-4 శాతం వరకు రక్షణ గంగంకు కేటాయింపులు జరపడంతో సైనిక సంస్కరణలకు అవసరమైన మద్దతు లభించింది.
1971 తర్వాత చాల తక్కువ సందర్భాలలో మాత్రమే ఆ స్థాయిలో రక్షణ రంగంపై బడ్జెట్ కేటాయింపులు జరిగాయి. ఉదాహరణకు, 2020-21 వార్షిక బడ్జెట్ లో రక్షణ రంగంపై రూ 4.73 లక్షల కోట్లు కేటాయించినా, జీడీపీలో అది కేవలం 1. 63 శాతం మాత్రమే. అందులో అత్యధిక మొత్తం సిబ్బంది జీత, భత్యాలు, పెన్షన్లకు ఖర్చు పెట్టవలసి రావడంతో ఆయుధాలు సమకూర్చుకోవడానికి లభించే మొత్తం చాల తక్కువని గమనించాలి.
ఆ విధంగా తొమ్మిదేళ్లపాటు జరిగిన కృషి 1971 యుద్ధంలో నిర్ణయాత్మకమైన విజయంకు కారణమైనది. పైగా, వత్తిడి రాగానే వెంటనే యుద్దానికి దిగకుండా, యుద్దానికి సంసిద్ధం కావడానికి, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా వచ్చేవరకు సుమారు 10 నెలల పాటు సన్నాహాలు చేసుకొంటూ గడిపాము. మరే యుద్ధంలో కూడా మనకు అంత దీర్ఘకాల సౌలభ్యం దొరకలేదు.
అయితే ఆ యుద్ధం అసలు ఏ విధంగా జరిగింది? రాజకీయ, దౌత్య, సైనిక పరంగా జరిగిన పరిణామాలు ఏమిటి? మన సేనలు యుద్దానికి ఏవిధంగా సిద్ధమయ్యాయి? ఆ సమయంలో ఎటువంటి సవాళ్ళను ఎదుర్కొన్నాయి? ఇటువంటి అంశాలపై ఇప్పటికే సాధికారికంగా కధనాలు అందుబాటులో లేవు.
1971 యుద్ధం గురించి భారతీయ రచయితలే కాకుండా, విదేశీ రచయితలు సహితం అనేక గ్రంధాలు వ్రాసారు. సవివరమైన కధనాలు వ్రాసారు. వారిలో కొందరు ఆ సమయంలో యుద్ధంలో పాల్గొన్న సైనిక అధికారులు ఉన్నారు. పలువురు రక్షణ రంగ నిపుణులు ఉన్నారు. రిటైర్డ్ సైనిక అధికారులు ఉన్నారు. అయితే అవన్నీ వారి, వారి ధోరణులతో సాగాయి గాని, ఇప్పటి వరకు అధికారిక చరిత్ర అందుబాటులో లేదని చెప్పవచ్చు.
వీటిల్లో కొన్ని గ్రంధాలు కొన్ని వివాదాలను కూడా రేపాయి. అయితే అవేవి అధికారిక పాత్రల ఆధారంగా వ్రాసినవి కావు. అందుచేత అవేమి సమగ్రమైన స్వరూపాన్ని మన ముందు ఉంచలేవు. ఈ గ్రంధాలలో పరస్పర భిన్నమైన కధనాలు కూడా ఉన్నాయి.
ముఖ్యంగా నాటి ప్రధాని ఇందిరా గాంధీ, సైన్యాధిపతి జనరల్ మానెక్ షా ప్రదర్శించిన నాయకత్వంను ఈ సందర్భంగా అందరూ ప్రస్తావిస్తున్నారు. ఈ సందర్భంగా వస్తున్న కధనాలలో కొన్ని గోరంతను కొండత చేసిన్నట్లుగా కూడా వివరించినట్లు ఉన్నాయి. వారిద్దరూ అత్యంత స్ఫూర్తిదాయక నాయకత్వాన్ని ఆ సమయంలో అందించారనడంలో సందేహం లేదు. వారిద్దరికీ మించి కూడా ఎన్నో పరిణామాలు జరిగాయి.
యుద్దాన్ని ఏప్రిల్ లోనే ప్రారంభించాలని ఇందిరా గాంధీ అనుకున్నారని, మానెక్ షా `రాజీనామా’కు సిద్దపడడంతో డిసెంబర్ వరకు ఆగారనే అభిప్రాయం కూడా ఉంది. అయితే జరిగిన పరిణామాలను అంత సులభంగా ముగించలేము. అనేక రాజకీయ, దౌత్య, సైనిక పరమైన అంశాలు ప్రస్తావనకు వచ్చి ఉండాలి.
విశేషమైన దౌత్య ప్రకియ
కేవలం సైనికుల సౌలభ్యం కోసమే కాకుండా, అంతర్జాతీయ పరిణామాల దృష్ట్యా కూడా భారత్ కు కొంత వ్యవధి అవసరమైంది. ప్రచ్ఛన్నయుద్ధ కాలంలో చైనా బెదిరింపులు, పాక్ కు అమెరికా మద్దతును దృష్టిలో పెట్టుకొని అంతర్జాతీయంగా విశేషమైన దౌత్య ప్రక్రియకు పూనుకోవలసి వచ్చింది.
ముఖ్యంగా పాకిస్థాన్ సేనలు సాగిస్తున్న మారణకాండ గురించి ప్రపంచ అభిప్రాయం సేకరించడమా కోసం భారత్ విశేషంగా కృషి చేసింది. ఇందిరా గాంధీ స్వయంగా 20 దేశాలు పర్యటించారు. దాదాపు అన్ని ముఖ్యమైన దేశాధినేతలను కలిశారు. వారెవ్వరూ భారత్ కు నేరుగా సహాయం చేయక పోయినా, నేరుగా యుద్ధభూమిలో భారత్ కు వ్యతిరేకంగా చేయలేక పోయారు.
మరో ముఖ్యమైన పరిణామం, ఒకే సారి మూడు దేశాల యుద్ధం చేయడానికి భారత్ సిద్దపడవలసి వచ్చింది. అటువంటి పరిస్థితి మరెప్పుడు ఎదురు కాలేదు. ఒక వంక తూర్పు పాకిస్థాన్ లో పోరాడుతూనే, పశ్చిమ పాకిస్థాన్ లో రెచ్చగొట్టే చర్యలకు పాలపడుతున్న పాక్ సేనలను ముందుకు సాగకుండా కట్టడి చేయవలసి వచ్చింది. పాకిస్థాన్ కు మద్దతుగా చైనా మరోవైపున సైనిక చర్యకు ఎక్కడ దిగుతుందో అని అప్రమత్తంగా ఉండవలసి వచ్చింది.
మనకున్న సైనిక వనరులను మూడు దిశలా మోహరించడం అప్పట్లో అంత సాధారణమైన అంశం కాదు. అందుకు ఎంతో వ్యూహాత్మకమైన ప్రణాళికలు రూపొందించి ఉండాలి. అదే విధంగా పాక యుద్ధ నౌక విక్రాంత్ ను ధ్వసం చేయడం కోసం సుదూర ప్రయాణం చేసి వచ్చిన పాక్ జలాంతర్గామి విశాఖపట్నం నౌకాశ్రయం వద్ద సముద్రంలో మునిగిపోయింది. అప్పుడు అసలేమీ జరిగినా ఇప్పటికే సాధికారికంగా కధనం లేదు.
భారత్ నౌకాదళమే తప్పుడు టెలిగ్రామ్ సంకేతాలను పాక్ జలాంతర్గామికి చేరేవిధంగా చేసి, అది విశాఖకు చేరుకొని, అక్కడే సముద్రంలో మునిగిపోయే విధంగా చేశారా? ఇటువంటి అనేక సంఘటనలకు సాధికారిక కధనాలు లేవు.
గుర్తింపు లేని ప్రజా దౌత్యం
సైనిక విజయం గురించి ప్రముఖంగా ప్రస్తావిస్తున్నప్పుడు ఈ సందర్భంగా జర్నలిస్టులు, కళాకారులు, దౌత్యవేత్తలు, ఇతర పౌర సమాజ సభ్యులతో కూడిన ప్రజా దౌత్యం వహించిన పాత్ర గురించిన ప్రస్తావన ఎక్కడ ఉండటం లేదు.
తూర్పు బెంగాల్ ప్రజలపై చూపుతున్న వివక్షత, ఆర్థికాభివృద్ధికి దూరంగా నెట్టివేయడం, రాజకీయ అధికారానికి దూరం చేయడం వంటి పరిస్థితులు వారిలో తిరుగుబాటు ధోరణులను పెంపొందించడం, భారత దేశం మానవతా సహాయంతో ముందుకు వచ్చి, పాక్ సేనల ఊచకోతను ప్రతిఘటించడంలో విశేషమైన సహకారం అందించడం బంగ్లాదేశ్ ఆవిర్భావానికి దారితీసినది అనడంలో సందేహం లేదు.
అయితే, తీసినప్పటికీ, ఈ సమయంలో పౌర సమాజం పోషించిన పాత్ర చాలా తక్కువగాగా మాత్రమే తెలుస్తున్నది. బంగ్లాదేశ్ సంక్షోభ సమయంలో అంతర్జాతీయ మద్దతును పొందేందుకు ఇందిరా గాంధీ కూడా ప్రజా దౌత్యాన్ని ఉపయోగించారు. శరణార్థుల దుస్థితిని ఎత్తి చూపేందుకు, వారు సురక్షితంగా స్వదేశానికి తిరిగి వచ్చేలా చూడాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు బాసటగా నిలిచారు.
విదేశాల్లోని వివిధ విశ్వవిద్యాలయాలలో విద్యార్ధులుగా ఉన్న తూర్పు పాకిస్థానీయులు కూడా ప్రజా దౌత్యాన్ని సమర్థవంతంగా ఉపయోగించారు. నోబెల్ గ్రహీత, గ్రామీణ బ్యాంక్ వ్యవస్థాపకుడు ముహమ్మద్ యూనస్ వారిలో ఒకరు. టేనస్సీలోని స్థానిక టీవీ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా బంగ్లాదేశ్ వాదానికి మద్దతు లభించిందని అతను తన జ్ఞాపకాలలో రాశాడు.
ఈ కాలమంతా, బంగ్లాదేశ్ సమస్యను వివిధ మార్గాల ద్వారా ప్రపంచ వేదికపై లేవనెత్తడానికి ప్రజా దౌత్యంను ఉపయోగించారు. ‘కాన్సర్ట్ ఫర్ బంగ్లాదేశ్’ అనేది జార్జ్ హారిసన్, రవిశంకర్ లు నిర్వహించిన ఒక కార్యక్రమం, ఇది రాత్రిపూట బంగ్లాదేశీయుల గురించి బయటి ప్రపంచానికి తెలిసేలా చేసింది. ‘జేబోన్ తేకే నేయా’ లాంటి సినిమాలు అసంఖ్యాక ప్రజల్లో దేశభక్తి జ్వాలలు రగిలించడంలో కీలకపాత్ర పోషించాయి.
గ్రేట్ బ్రిటన్, తూర్పు – పశ్చిమ జర్మనీ, ఫ్రాన్స్, రష్యా, పోలాండ్ బంగ్లాదేశ్ వాదానికి సానుభూతి చూపాయి. అయితే స్పెయిన్, ఈజిప్ట్ ఎప్పుడూ పూర్తి మద్దతు ఇవ్వలేదు.
సాధికారికత చరిత్ర అవసరం
ఈ మొత్తం చరిత్రను కూడా సాధికారికంగా గ్రంధస్థం చేయవలసి ఉంది. `ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ సందర్భంగా 1971 యుద్ధంకు సంబంధించిన వాస్తవ, సాధికారిక చారిత్రాత్మక కధనాన్ని ప్రజలు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం జరగగలదని ఆశిద్దాము.
భారతదేశం, పాకిస్తాన్ 1947-48లో జమ్మూ, కాశ్మీర్‌పై యుద్ధానికి దిగాయి. ఈ యుద్ధానికి సంబంధించిన అధికారిక కథనం ఉనికిలో ఉంది. దీనిని రక్షణ మంత్రిత్వ శాఖ బయటపెట్టింది. 1965లో మళ్లీ జమ్మూ, కాశ్మీర్ ను లాక్కోవాలని ప్రయత్నించడంతో మనం పాకిస్తాన్‌తో మళ్లీ యుద్ధానికి దిగాము. ఈ యుద్ధంకు సంబంధించిన కొన్ని ప్రసిద్ధ చారిత్రక అధికారిక కధనం అందుబాటులో లేదు.
మూడవసారి, 1971లో జరిగిన యుద్ధంలో భారతదేశం, పాకిస్థాన్‌లు మరోసారి తలపడ్డాయి. 1947-48లో, 1965లో జరిగిన యుద్ధాల్లో తూర్పు పాకిస్థాన్‌కు ఎటువంటి పాత్ర లేదు.డిసెంబరు 3 నుండి 16 వరకు 13 రోజుల పాటు జరిగిన 1971 యుద్ధం ముగిసే సమయానికి తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్‌గా మారింది.
దురదృష్టవశాత్తూ, ఈ యుద్ధం గురించిన అధికారిక కధనం ప్రస్తుతం అందుబాటులో లేదు. 1971 యుద్ధం గురించి చాలా పుస్తకాలు ఉన్నాయి, కానీ అధికారిక కధనం ఒకటి, రెండు సంపుటాలుగా ప్రచురించడం చాలా అవసరం. ఒక సంపుటం తూర్పు పాకిస్తాన్లో యుద్ధం గురించి మాట్లాడవచ్చు. రెండవ సంపుటం పశ్చిమ పాకిస్తాన్‌తో యుద్ధం గురించి మాట్లాడవచ్చు.
పాకిస్తాన్‌తో సత్సంబంధాల గురించిఆలోచిస్తూ మనం వాస్తవ చరిత్రను మరుగున పడేటట్లు చేయడం ద్వారా మనలను మనమే మోసం చేసుకొంటున్నాము. 1971 యుద్ధానికి దారితీసిన పరిస్థితుల గురించి మెరుగైన అవగాహనను భవిష్యత్ తరాలకు అందుబాటులో ఉంచాలి. ఇప్పటికే చాలా జాప్యం జరిగింది.