2024 లోక్సభ ఎన్నికల్లో సమైక్యంగా పోటీ చేసి అధికారంలోకి రావాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేస్తున్న బిజెపియేతర ప్రతిపక్షాల రెండవ సమావేశం జులై 13–14 తేదీలలో బెంగళూరులో జరగనున్నది. గతంలో నిర్ణయించినట్లు సిమ్లాలో కాకుండా బెంగళూరులో రెండవ సమావేశాన్ని నిర్ణయించినట్లు ఎన్సిపి అధినేత శరద్ పవార్ గురువారం వెల్లడించారు.
వచ్చే లోక్సభ ఎన్నికల్లో బిజెపిని గద్దె దించడమే ఏకైక లక్షంగా జూన్ 23న బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆధ్వర్యంలో పాట్నాలో జరిగిన తొలి సమావేశం ప్రతిపక్షాల మధ్య ఐక్యతకు సంబంధించి అనుసరించాల్సిన వ్యూహంపై ప్రాథమికంగా చర్చించింది.
తొలి సమావేశానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, ఎన్సిపి అధినేత శరద్ పవార్, శివసేన(ఉద్ధవ్ థాక్రే) నాయకుడు ఉద్ధవ్ థాక్రే, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్, ఆర్జెపి అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, సమాజ్వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, సిపిఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఓమర్ అబ్దుల్లా, టిడిపి అధినేత్రి మెహబూబా ముఫ్తీ తదితర నాయకులు పాల్గొన్నారు.
పాట్నాలో జరిగిన విపక్షాల సమావేశంలో కాంగ్రెస్తో సహా 17 రాజకీయ పార్టీలు పాల్గొన్నాయి. 2024 లోక్సభ ఎన్నికల్లో కలిసికట్టుగా బీజేపీని ఎదుర్కోవడంపై చర్చించాయి. ప్రతిపక్ష పార్టీల మధ్య ఉన్న విభేదాలు పక్కన పెట్టి ముందుకు సాగాలని పార్టీల అధినేతలు భావించారు. దీనికి సంయుక్త వ్యూహరచన కోసం సిమ్లాలో సమావేశం కావాలని నిర్ణయించారు.
తదుపరి సమావేశం సిమ్లాలో మల్లిఖార్జున్ ఖర్గే అధ్యక్షతన జరపాలని నిర్ణయించారు. అయితే ఇటీవలనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కర్ణాటకకు, పైగా, ఖర్గే స్వరాష్ట్రంకు వేదికను మార్చారు. ఈ సమావేశంలో ప్రతిపక్షాల మధ్య సీట్ల సర్దుబాటు విధానం గురించి, అందరికి కనీస కార్యక్రమం గురించి చర్చింపనున్నారు. అయితే ఢిల్లీ ఆర్డినెన్సు విషయంలో కాంగ్రెస్ తన వైఖరిని స్పష్టం చేయకపోవడంతో అసంతృప్తిగా ఉన్న ఆప్ ఈ సమావేశంకు హాజరయ్యే విషయంలో సందిగ్ధత నెలకొంది.