ఇటీవల మనీలాండరింగ్ కేసులో అరెస్టైన మంత్రి సెంథిల్ బాలాజీని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేస్తూ తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి ఆదేశాలు జారీ చేయడంతో ఆ రాష్ట్రంలో రాజకీయ దుమారం చెలరేగింది. దీనిపై న్యాయ పోరాటం చేస్తామని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రకటించడంతో, కొద్ది గంటల తర్వాత బర్తరఫ్ ఉత్తరువును ప్రస్తుతంకు అమలు కాకుండా ఉంచుతున్నట్లు రాజ్ భవన్ ప్రకటించింది.
దీనిపై అటార్నీ జనరల్ సలహాను గవర్నర్ కోరనున్నట్లు చెబుతున్నారు. అయితే, మంత్రివర్గం సిఫార్సు లేకుండా గవర్నర్ ఇటువంటి ఆదేశాలు జారీ చేయడం స్వతంత్ర భారత చరిత్రలో ఇదే మొదటిసారని రాజకీయ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.
కాగా, ఇప్పటికే సెంథిల్ బాలాజీ మనీలాండరింగ్ కేసులో అరెస్టై జైల్లో ఉన్న విషయం తెలిసిందే. ఉద్యోగాలు అమ్ముకోవడంతో సహా సెంథిల్ బాలాజీపై తీవ్రమైన అవినీతి ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో మంత్రిగా ఉంటే విచారణను ప్రభావితం చేసే అవకాశం ఉందని రాజ్‌భవన్ కార్యాలయం విడుదల చేసిన ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.
ఇలాంటి పరిస్థితుల్లో తక్షణమే ఆయనను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేస్తున్నట్లు పేర్కొంది. జూన్ 14న మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్టు చేసింది. జులై 12 వరకు సెంథిల్ బాలాజీ జ్యుడీషియల్ కస్టడీలో ఉండనున్నారు.
అన్నాడీఎంకే ప్రభుత్వంలో 2014లో రవాణా శాఖ మంత్రిగా ఉన్న సెంథిల్ బాలాజీపై ఉద్యోగాల కోసం డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలున్నాయి. అయితే, ఆ తర్వాత 2018లో డీఎంకే పార్టీలో చేరి ఎన్నికల్లో గెలిచిన సెంథిల్‌కు ఎంకే స్టాలిన్ ప్రభుత్వంలోనూ మంత్రి అయ్యారు.
ఇప్పటికే గవర్నర్, సీఎం స్టాలిన్ మధ్య మాటల యుద్ధ జరుగుతున్న క్రమంలో తాజా నిర్ణయం మరింత దూరాన్ని పెంచినట్లయింది. పాలనలో గవర్నర్ జోక్యం చేసుకోవడంపై స్టాలిన్ సహా మంత్రులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
తన మంత్రివర్గ సహచరుడు సెంథిల్‌ను గవర్నర్ బర్తరఫ్ చేయడంను ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు ఎంకె స్టాలిన్ తప్పుబట్టారు. గవర్నర్‌కు మంత్రులను తొలగించే హక్కులేదని, ఈ అంశాన్ని న్యాయపరంగా ఎదుర్కొంటామని ప్రకటించారు. ఇలాంటి నిర్ణయాలు సహించబోమని పేర్కొంటూ గవర్నర్ పరిధి దాటి వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
అయితే మంత్రిని తొలగించడాన్ని బీజేపీ స్వాగతించింది. ‘‘ఏది ఒప్పో, ఏది తప్పో గవర్నర్‌కు తెలుసు. న్యాయం జరిగింది. ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు సంతోషిస్తున్నాం’’ అని బీజేపీ పేర్కొంది.
