తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై బీజేపీ ఎమ్యెల్యే, మాజీ మంత్రి ఈటెల రాజేందర్ అసహనం వ్యక్తం చేశారు. పార్టీ మార్పుపై పదేపదే తనలాంటి వాడిని ప్రశ్నించవద్దని….. పార్టీలు మార్చడమంటే బట్టలు మార్చినంత ఈజీ కాదని బదులిచ్చారు. అభివృద్ధి కోసం మాత్రమే కాదు తెలంగాణ తెచ్చుకుందని…. అత్మగౌరవం కోసం కూడా” అని గుర్తు చేశారు.
శుక్రవారం సిద్ధిపేట జిల్లాలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ “పార్టీలు మారటమంటే బట్టలు మార్చుకున్నంత ఈజీ కాదు. ఉదయం, సాయంత్రం, రాత్రి ఇలా ఏదో ఒక టైంలో వేర్వురు వార్తలు వస్తున్నాయి. వీటన్నింటికి సమాధానం ఇవ్వలేను” అని తెలిపారు.
తాను కాంగ్రెస్ లో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పార్టీ ఏదో ఆశతో ఉందని, అధికారంలోకి రావాలని చూస్తోందని సానుభూతి వ్యక్తం చేశారు. అయితే, సోషల్ మీడియాలో వచ్చే వార్తలతో హైప్ క్రియేచ్ చేసుకుంటే ప్రజల మద్దతు రాదని స్పష్టం చేశారు.
“ఒకటి మాత్రం చెప్పగలను… బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఇవాళ పరిస్థితులను చూస్తే…. కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్ కోవర్టులను పెట్టుకుంటాడు. భారతీయ జనతా పార్టీలో కూడా కేసీఆర్… కోవర్టులను పెట్టుకుంటాడు. పార్టీలు ముద్ద కాకుండా చూసే ప్రయత్నం చేస్తాడు. ఇంటి దొంగల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది” అని ఈటల హెచ్చరించారు.
మరోవంక, ట్రాలీలోకి ఎక్కకుండా సతాయిస్తున్న దున్నపోతు తోక మెలితిప్పి, తంతున్న వీడియోను పోస్ట్ చేసిన బిజెపి మాజీ ఎంపీ జితేందర్ తెలంగాణ బిజెపికి కూడా ఇలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలనడమే కాకుండా, ఈటెల వంటి వారిని ఉద్దేశించి అని పేర్కొనడం పట్ల ఈటెల విచారం వ్యక్తం చేశారు.
ఆ ట్వీట్ ఏంటో, దానికి అర్థమేంటో జితేందర్ రెడ్డినే అడగాలని ఆయన సూచించారు. వయసు, అనుభవం పెరిగిన కొద్దీ ప్రజా జీవితంలో ఉన్న వాళ్లు జాగ్రత్తగా ఉండాలని అంటూ ఇతరుల గౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరించకూడదని ఈటల చెప్పారు. ఏది పడితే అది చేయడం మంచిది కాదని హితవు పలికారు. ఎవరి స్వేచ్ఛ, గౌరవాన్ని తగ్గించకూడదని, ఈ విషయాన్ని బేసిక్‌గా గుర్తుపెట్టుకోవాలని పేర్కొన్నారు.