2002లో గుజరాత్లో జరిగిన అల్లర్లకు సంబంధించిన కేసుల్లో యాక్టివిస్ట్ తీస్తా సెతల్వాద్ కు గుజరాత్ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆ అల్లర్లకు సంబంధించిన కేసుల్లో అమాయకులను ఇరికించేందుకు సాక్ష్యాధారాలను కల్పించారనే ఆరోపణకు సంబంధించిన కేసులో సాధారణ బెయిలు మంజూరు చేసేందుకు హైకోర్టు శనివారం నిరాకరించింది. అంతే కాకుండా ఆలస్యం చేయకుండా లొంగిపోవాలని ఆమెను కోర్టు ఆదేశించింది.
ఆ సమయంలో రాష్ట్రంలో జరిగిన అల్లర్లకు సంబంధించిన కేసుల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహా మరికొందరిని ఇరికించేందుకు తీస్తా సెతల్వాద్ ప్రయత్నించారని కేసు నమోదైంది. అయితే గుజరాత్ అల్లర్లలో అప్పటి ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ, తదితరుల ప్రమేయం లేదని ప్రత్యేక దర్యాప్తు బృందం క్లీన్ చిట్ ఇచ్చింది.
దీనిపై జకియా సుప్రీంకోర్టు జకియా పిటిషన్ దాఖాలు చేయగా గత ఏడాది జూన్ 24న తోసిపుచ్చింది. గుజరాత్ అల్లర్ల కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందానికి తప్పుడు సమాచారం ఇచ్చారన్న ఆరోపణలపై ఆమెను గుజరాత్ ఉగ్రవాద నిరోధక బృందం (ఏటిఎస్) మరుసటి రోజు జూన్ 25వ తేదన అరెస్టు చేసింది. ఆమెతోపాటు మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆర్బి శ్రీకుమార్ని కూడా గుజరాత్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.
పోలీసు రిమాండ్ ముగిసిన తర్వాత కోర్టు జులై 2వ తేదీ వారిని జ్యుడిషియల్ కస్టడీకి పంపింది. ఈ కేసులో సుప్రీంకోర్టు తీస్తా సెతల్వాద్కి సెప్టెంబర్లో మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం మధ్యంతర బెయిల్పై జైలు బయట ఉన్న ఆమె తక్షణమే లొంగిపోవాలని గుజరాత్ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
దీనిపై ప్రభుత్వం కోర్టును ఆశ్రయిచండంతో నేటి తాజా విచారణ అనంతరం జస్టిస్ నిర్జర్ దేశాయ్ నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం తీర్పు చెప్తూ, తీస్తా సెతల్వాద్ బెయిలు దరఖాస్తును డిస్మిస్ చేసింది. ఆలస్యం చేయకుండా వెంటనే లొంగిపోవాలని ఆమెను ఆదేశించింది.