మణిపూర్ హింసాకాండలో చైనా జోక్యం ఉందని అక్కడ అలజడి రేపడంలో డ్రాగన్ కుట్రపూరితంగా వ్యవహరించిందని శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ ఆరోపించారు. మణిపూర్ హింస వెనుక విదేశీహస్తం ఉన్నదంటూ ఆ రాష్త్ర ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ ఆరోపించిన మరుసటి రోజే రౌత్ ఈ ఆరోపణ చేయడం గమనార్హం.
చైనాపై ఎలాంటి చర్యలు చేపట్టారో చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని రౌత్ డిమాండ్ చేశారు. కేంద్రంలో, మణిపూర్‌లో బీజేపీ అధికారంలో ఉండగా ఈశాన్య రాష్ట్రం మే 3 నుంచి అశాంతితో భగ్గుమంటున్నదని శివసేన ఎంపీ ఆందోళన వ్యక్తం చేశారు. రెండు నెలలుగా మణిపూర్‌లో అల్లర్లు చెలరేగుతూ రాష్ట్రం అట్టుడుకుతున్నదని తెలిపారు.
ప్రజలు ఇండ్లు విడిచి పునరావాస శిబిరాల్లో తలదాచుకుంటున్నారని, పరిస్ధితిని చక్కదిద్దేందుకు మీరేం చర్యలు తీసుకున్నారని పాలక కాషాయ నేతలను ఆయన నిలదీశారు. మణిపూర్‌లో శాంతి భద్రతలను కాపాడటంలో విఫలమైన సీఎం ఎన్ బీరేన్ సింగ్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని సంజయ్ రౌత్ డిమాండ్ చేశారు.
ఇలా ఉండగా, ఈ హింస పథకం ప్రకారమే జరుగుతుందని, ఇందులో విదేశీ శక్తుల హస్తం కూడా ఉండే అవకాశం ఉందని మణిపూర్‌లో నెలకొన్న హింసాకాండపై ముఖ్యమంత్రి ఎన్.బీరేన్ సింగ్ తెలిపారు. మణిపూర్ మయన్మార్‌తో సరిహద్దును పంచుకుంటుందని ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ గుర్తు చేశారు.
‘‘ చైనా కూడా సమీపంలోనే ఉంది. మన సరిహద్దుల్లో దాదాపు 398 కి.మీ.లు సురక్షితంగా లేవు. మన సరిహద్దుల్లో భద్రతా బలగాలు మోహరించబడ్డాయి, అయితే ఈ మోహరింపు అంత పెద్ద ప్రాంతాన్ని కవర్ చేయదు. ఈ మొత్తం విషయం ముందుగానే పరిష్కరించబడినట్లు అనిపిస్తుంది, కానీ దాని వెనుక కారణం ఇంకా స్పష్టంగా లేదు. దీనితో పాటు అతను దానిని పూర్తిగా ధృవీకరించలేను ’’ అని చెప్పారు.
కాగా సీఎం పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధపడిన బీరేన్ సింగ్ రాజ్‌భవన్‌కు వెళుతుండగా వేలాది మంది బీరేన్ కాన్వాయ్‌ను అడ్డగించి సీఎంగా కొనసాగాలని పట్టుబట్టడంతో మూడు రోజుల ఇంఫాల్‌లో హైడ్రామా నెలకొంది. ఆపై ఈ కీలక దశలో తాను సీఎం పదవికి రాజీనామా చేయడం లేదని బీరేన్ సింగ్ ట్వీట్ చేయడం పెను దుమారం రేపింది.
ఇక మే 3 నుంచి రాష్ట్రంలో మెటై, కుకీ తెగల మధ్య జరిగిన ఘర్షణలు, చెలరేగిన హింసాకాండతో ఇప్పటివరకూ 130 మందికి పైగా మరణించారు.