విదేశాల సాధించిన అనుభవం, అభివృద్ధిని ఏపీకి కూడా తీసుకు రావాలని ప్రవాసాంధ్రులకు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. నాటా తెలుగు మహాసభలను ఉద్దేశించి సిఎం జగన్ ప్రసంగిస్తూ ప్రవాసాంధ్రుల అనుభవాన్ని రాష్ట్రాభివృద్ధికి వినియోగించాలని కోరారు. అమెరికాలోని డాలస్‌లో జరుగుతున్న నాటా తెలుగు మహా సభలనుద్దేశించి ముఖ్యమంత్రి ఇచ్చిన వీడియో సందేశాన్ని నాటా సభల్లో ప్రదర్శించారు.
వేరే దేశంలో ఉన్నా తెలుగు వారు సంస్కృతి సంప్రదాయాలు కాపాడుకోవడం సంతోషంగా ఉందని, తెలుగు వారు సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుంటూ ఐక్యమత్యాన్ని చాటడం సంతోషంగా ఉందని చెప్పారు. పెద్దపెద్ద కంపెనీల సీఈఓలుగా, ఐటీ నిపుణులుగా, నాసా వంటి సంస్థల్లో పరిశోధకులుగా, అమెరికా ప్రభుత్వ ఉద్యోగులుగా, డాక్టర్లుగా, ప్రొఫెసర్లుగా రాణించడంపై గర్వ పడుతున్నట్లు చెప్పారు.
ప్రవాసుల్లో చాలామంది పేద, మధ్య తరగతి కుటుంబాల నుంచి వచ్చినా అమెరికా వెళ్లి ఈ స్థాయికి రావడానికి కఠోరమైన శ్రమ, పట్టుదల అక్కడ ఉన్నతంగా నిలిపాయని తెలిపారు. మిమ్మల్ని చూసి ఆ స్ఫూర్తి ప్రతి ఒక్కరిలో వస్తుందని అంటూ ఆకాశమంత హద్దుగా, ఆకాశాన్ని దాటి వెళ్లాలనే కోరికతో కావాల్సిన సదుపాయాలన్ని కల్పించాలనే తపనతో విద్యా రంగంలో ఏపీలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చినట్లు చెప్పారు.
చదువు పెద్ద అవసరమైన సాధనమని, గ్లోబల్ సిటిజన్స్‌గా ఎదగడానికి ముఖ్యమని పేర్కొంటూ రాష్ట్రంలో ప్రభుత్వ బడుల రూపురేఖలు మారుతున్నాయని, నాడు నేడు చేపట్టామని, 8లో ట్యాబ్స్ ఇస్తున్నామని, 3 నుంచి సబ్జెక్ట్ టీచర్స్, ఆరు నుంచి డిజిటల్ విద్య అందిస్తున్నామని ముఖ్యమంత్రి వివరించారు. తరగతుల్లో ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానల్స్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
ఈటిఎస్ ప్రిన్స్టన్తో 3వ తరగతి నుంచి టోఫెల్ శిక్షణ ఇచ్చేందుకు ఒప్పందం చేశామని, అమ్మఒడి గోరుముద్ద, విద్యా దీవెన, వసతి దీవెన వంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. విద్యా రంగంలో ఏ రంగంలోనైనా ఇలాంటి మార్పులు అమలు చేస్తున్నామని జగన్ తెలిపారు.
ప్రవాస భారతీయులు ప్రతిఒక్కరు తమ గ్రామాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయో తెలుసుకోవాలని ముఖ్యమంత్రి కోరారు. ప్రతి ఊరిలో అదే గ్రామానికి చెందిన వాలంటీర్లు పౌర సేవలు అందిస్తున్నారని పేర్కొంటూ ప్రతి గ్రామంలో రైతుభరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల్ని చేయి పట్టి నడిపిస్తున్నట్లు చెప్పారు.
ప్రతి గ్రామంలో విలేజీ క్లినిక్స్ కూడా వచ్చాయని చెబుతూరానున్న రోజుల్లో మెడికల్ బిల్స్ కట్టడి చేయడానికి, అవసరమైన చర్యలు విలేజీ క్లినిక్స్ రూపంలో ప్రివెంటివ్ మెడిసిన్ రూపంలో తెచ్చామని జగన్ వివరించారు. అధికారంలోకి వచ్చాక వైద్య రంగంలో 48వేల పోస్టులు తీసుకువచ్చామని చెప్పారు.
ఇంగ్లీష్ అనేది ప్రపంచంలో విజ్ఞానాన్ని నేర్చుకోడానికి అవసరమైన మీడియం కాబట్టి, ఏది కావాలన్నా, ఏది చదువుకోవాలన్నా, సైన్స్, ఆర్ట్స్, ఇంజనీరింగ్ పిల్లలు తమకు తాము ఏ సబ్జెక్ట్‌లో అవగాహన రావాలన్నా ఇంగ్లీష్ రావాలని స్పష్టం చేయసారు. ప్రతి కంటెంట్ ఇంగ్లీష్‌లో ఉంటున్నందున దానిని నేర్చుకోవాల్సిన అవసరం ఉందని చెబుతూ ప్రపంచంలోకి వెళ్లేందుకు కావాల్సిన ఇంగ్లీష్ భాషను ప్రభుత్వం పిల్లలకు అందిస్తుందని చెప్పారు.