తెలంగాణలో ఎవరు ఎవరికి బీ టీమో ప్రజలకు బాగా తెలుసునని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. పార్టీ నడపలేక చేతులెత్తేసిన రాహుల్ గాంధీ బీజేపీపై విమర్శలు చేయడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. ఖమ్మం సభలో రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలను విని తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారని చెప్పారు.
తెలంగాణలో బీజేపీ ఖతం అంటున్న వారి పరిస్థితేంటో నాలుగు నెలల్లో ప్రజలు తేలుస్తారని కిషన్రెడ్డి జోస్యం చెప్పారు. తెలంగాణలో బీజేపీ ఎదుగుదలను అడ్డుకునేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు లోపాయకారి ఒప్పందం చేసుకుని పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నాయని విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ జెండాతో గెలిచిన ఎమ్మెల్యేలను కాపాడుకోవడం చేతకాని నాయకులు తెలంగాణలో అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటున్నారని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పార్లమెంట్ సమావేశాలను అడ్డుకునేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి కుట్ర చేయలేదా? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.
2004లో టీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి పోటీ చేయడం, రాష్ట్ర ప్రభుత్వంలో, కేంద్ర ప్రభుత్వంలో ఇరు పార్టీలు మంత్రిపదవులు పంచుకోవడం తెలంగాణ ప్రజలకు ఇంకా గుర్తుందని చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్ తో ఏనాడూ పొత్తు పెట్టుకోలేదన్న కిషన్ రెడ్డి, బీజేపీకి బీఆర్ఎస్ ఎంత దూరమో.. కాంగ్రెస్ కు బీజేపీ అంతేదూరమని స్పష్టం చేశారు.
కుటుంబ పాలనకు ఆద్యులైన రాహుల్ కుటుంబానికి బీజేపీ గురించి మాట్లాడే అర్హత ఎక్కడిదని కేంద్ర మంత్రి నిలదీశారు. కాంగ్రెస్, ఆ పార్టీ నాయకులు అధికారంలో ఉంటే దేశ సంపదను దోచుకుంటారని, అదే ప్రతిపక్షంలో ఉంటే ప్రజల మధ్య చిచ్చుపెట్టి దేశ సమగ్రత, సమైక్యతను దెబ్బతీస్తారని కిషన్ రెడ్డి విమర్శించారు.
సైనికులు, దేశ గౌరవాన్ని మంటగలిపే కులం, మతం, భాష, ప్రాంతం పేరుతో ప్రజలను విభజించి పబ్బం గడుపుతారని మండిపడ్డారు. బీఆర్ఎస్-కాంగ్రెస్కు కుర్చీ కోసం ఆరాటమే తప్ప ప్రజా సంక్షేమం పట్టదని విమర్శించారు. అందుకే ఆ పార్టీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అడ్రస్ లేకుండా పోయిందని తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు.