తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధ్యక్షులను మార్చారు. ఓ వైపు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు సార్వత్రిక ఎన్నికలకు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర పార్టీ బాధ్యలను మార్చాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు తొలగించింది. సోము వీర్రాజును పదవి నుంచి తప్పించిన బీజేపీ నాయకత్వం, ఆ సమాచారాన్ని అధికారికంగా ఆయనకు తెలిపింది.
మంగళవారం సోమువీర్రాజుకు ఫోన్ చేసిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు పదవీకాలం పూర్తయినందున తప్పిస్తున్నట్లు తెలిపారు. పదవికి రాజీనామా చేయాలని సూచించారు.
సోము వీర్రాజు స్థానంలో మాజీ కేంద్ర మంత్రి, ప్రస్తుత జాతీయ ప్రధాన కార్యదర్శి డి. పురంధేశ్వరిని పార్టీ అధ్యక్షురాలిగా నియమించారు. అయితే ముందు మీడియాలో సత్య కుమార్, సుజనా చౌదరి పేర్లు వినిపించినా పురంధేశ్వరికి పదవి దక్కింది. మాజీ ముఖ్యమంత్రి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డిని జాతీయ కార్యవర్గ సభ్యనిగా చేశారు.
మరోవైపు తెలంగాణలో బీజేపీ బాధ్యతలు ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డికి అప్పగించారు. అయితే ఆయన్ని మంత్రి పదవిలో కొనసాగిస్తారా? లేదా? అనే దానిపై స్పష్టత లేదు. కిషన్ రెడ్డిని జోడు పదవుల్లో కొనసాగిస్తారా? ఎన్నికల నేపథ్యంలో పార్టీ బాధ్యతలకు పరిమతం చేస్తారా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. కిషన్ రెడ్డిని మంత్రి పదవి నుంచి తప్పిస్తే ఆయన స్థానంలో తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరికి మంత్రి పదవి దక్కుతుందనే చర్చ కూడా జరుగుతోంది.
1977లో జనతాపార్టీలో యువనాయకుడిగా కిషన్ రెడ్డి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1980లో బీజేపీ నుంచి ఆయన పార్టీలో పనిచేస్తున్నారు. 1985లో ఉమ్మడి రాష్ట్ర యువమోర్చా అధ్యక్షుడిగా, యువమోర్చాలో అనేక పదవులు నిర్వహించారు. 2001లో బీజేపీ రాష్ట్ర కోశాధికారిగా, 2004లో భారతీయ జనతా యువమోర్చా జాతీయ అధ్యక్షుడిగా పదవులు నిర్వహించారు. 2010 మార్చి నుండి తొలుత ఉమ్మడి ఏపీ బిజెపి అధ్యక్షునిగా, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర తొలి అధ్యక్షునిగా పనిచేశారు.