ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బిజెపి భారీ మార్పులకు, చేర్పులకు దిగుతోంది. ఈ క్రమంలో తాజాగా నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల ఇన్ఛార్జ్లను ప్రకటించింది. తెలంగాణ బీజేపీ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా జాతీయస్థాయి సీనియర్ నేత ప్రకాష్ జవదేకర్‌ను నియమించింది. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన చేసింది.
అలాగే సహాయ ఇన్‌ఛార్జ్‌గా జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్‌ను నియమించింది. ఇక ప్రకాశ్ జవదేకర్ గతంలో కేంద్ర మంత్రిగా, కేంద్ర మంత్రిగానూ పని చేశారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్.. ఇలా 2008 నుంచి ఆయన రాజ్యసభకు ఎన్నికవుతూ వస్తున్నారు. పార్లమెంట్లో పలు కమిటీలకు ఆయన చైర్మన్‌గా వ్యవహరిచారు.
2021లో కేంద్ర మంత్రి పదవికి దూరమయ్యారు. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఇన్ ఛార్జ్ గా వ్యవహరించారు. బిజెపిలో కీలకనేతగా ఉన్న జవదేకర్ తెలంగాణలో బిజెపిని అధికారంలోకి తీసుకువస్తాడనే భరోసాతో పార్టీ ఎన్నికల ఇన్ చార్జీ గా నియమించింది.
ఇక ఛత్తీస్‌గఢ్ ఎన్నికల ఇన్చార్జిగా ఓపీ మాథుర్, సహాయ ఇన్చార్జిగా కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ, రాజస్థాన్ ఇన్చార్జిగా కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి, సహాయ ఇన్చార్జిగా గుజరాత్ మాజీ డిప్యూటీ సీఎం నితిన్ పటేల్, మధ్యప్రదేశ్ ఇన్చార్జిగా భూపేంద్ర యాదవ్, సహాయ ఇన్చార్జిగా కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్ ను పార్టీ హైకమాండ్ నియమించింది.