అవినీతిపై చర్యలు తీసుకోవడంలో వెనకాడే ప్రసక్తే లేదని, అందుకు భయపడేవాడు మోదీయే కాదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఈ ఏడాది చివర్లో చత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాని మోదీ శుక్రవారం అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా చత్తీస్‌గఢ్ సంక్షేమం కోసం చర్యలు తీసుకోవడంలో వెనకంజవేయబోనని స్పష్టం చేశారు.
శుక్రవారం రాష్ట్రంలో పర్యటించిన ప్రధాని మోదీ రూ.7,600 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు , శంకుస్థాపనలు చేశారు. అనంతరం రాయపూర్‌లో జరిగిన ర్యాలీలో మాట్లాడుతూ కాంగ్రెస్ ఎంత గట్టిగా ప్రయత్నించినప్పటికీ చత్తీస్‌గఢ్ సంక్షేమానికి చర్యలు చర్యలు చేపట్టడంలో తాను వెనకంజవేయబోనని చెప్పారు. చత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ పెట్టిన పెట్టుబడులకు రెట్టింపు తాము పెడతామని చెబుతూ కాంగ్రెస్ పార్టీ పేదలకు శత్రువని ధ్వజమెత్తారు.
చత్తీస్‌గఢ్‌లో ప్రభుత్వం మారాలని ప్రజలు కోరుకుంటున్నారని, రాష్ట్రంలో ఆ గాలి వీస్తోందని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధిని ఓ పెద్ద పంజా (హస్తం) ఓ గోడలా అడ్డుకుంటోందని దుయ్యబట్టారు. ఇది కాంగ్రెస్ పంజా అని, ప్రజల హక్కులు లాక్కొంటోందని ఆరోపించారు. రాష్ట్రాన్ని దోచుకుని, నాశనం చేయాలని ఈ పంజా ప్రయత్నిస్తోందన్నారు.
ప్రతి విభాగంలోను అవినీతికి పాల్పడుతూ చత్తీస్‌గఢ్‌ను కాంగ్రెస్ తన ఎటిఎంగా మార్చుకుందని ప్రధాని తీవ్రస్థాయిలో విమర్శించారు. చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బాఘెల్ సమక్షంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. రాష్ట్రంలో మద్య నిషేధానికి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని, అయితే వాస్తవానికి వేలాది కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడిందని దయ్యబట్టారు.
ఈ సొమ్మంతా కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి వెళ్లిందని అంటూ ఇప్పుడు ఆ సొమ్ము కోసం పోట్లాట కారణంగా ఆ పార్టీ రెండున్నరేళ్ల అధికార పంపిణీ ఫార్ములాను అమలు చేస్తుందని జనం అంటున్నారని ప్రధాని ఆరోపించారు. బాఘేల్, టిఎస్ సింగ్‌దేవ్‌ల మధ్య ముఖ్యమంత్రి పదవి పంపిణీకి సంబంధించి ఒప్పందం కుదిరిందంటూ వస్తున్న వార్తలను పరోక్షంగా ప్రస్తావిస్తూ ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ రోజు చేపట్టిన కొత్త ప్రాజెక్టుల వల్ల ఉద్యోగావకాశాలు పెరుగుతాయని , ప్రజల జీవితాలు మెరుగుపడతాయని ప్రధాని తెలిపారు. గిరిజన ప్రాబల్య ప్రాంతాల్లో అభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అంటాగఢ్రాయపూర్ మధ్య నడిచే కొత్త రైలును ప్రధాని వర్చువల్ విధానంలో జెండా ఊపి ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ పథకం కింద లబ్ధిదారులకు కార్డుల పంపిణీని ప్రారంభించారు.