కెసిఆర్ ప్రభుత్వం అంటే అత్యంత అవినీతి ప్రభుత్వం అని, ఇప్పుడు వారి అవినీతి ఢిల్లీకి కూడా పాకిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. ప్రధాని మోదీ శనివారం తెలంగాణలో రూ. 6,100 కోట్ల విలువైన అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం హన్మకొండలో ఏర్పాటు చేసిన బిజెపి బహిరంగ సభలో ప్రసంగిస్తూ భద్రకాళి అమ్మవారి మహాత్యానికి, సమ్మక్క-సారలమ్మ శౌర్యానికి, రాణి రుద్రమ పరాక్రమానికి నిదర్శనమైన వరంగల్‌కు రావడం సంతోషంగా ఉందని చెప్పారు.
ఒక బిజెపి కార్యకర్తగా తాను వరంగల్‌కు వచ్చానని చెబుతూ జనసంఘ్ కాలం నుంచి ఈ ప్రాంతం తమ భావజాలానికి బలమైన కోటగా ఉందని తెలిపారు. బిజెపి తొలుత సాధించిన రెండు లోక్‌సభ సీట్లలో ఒకటి హన్మకొండ అని గుర్తు చేశారు. ఈ రోజు ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ అని పేర్కొంటూ అందులో తెలంగాణ అతి ముఖ్యమైన భూమిక అని చెప్పారు.
2021 మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్కు బిజెపి ట్రైలర్ చూపించిందని చెబుతూ వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్, కాంగ్రెస్‌లను అడ్రస్ లేకుండా చేయాలని పిలుపునిచ్చారు. కెసిఆర్ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. తెలంగాణలో కెసిఆర్ ప్రభుత్వం అవినీతిని పెంచి పోషించిందని మండిపడ్డారు. తెలంగాణ సర్కార్ అత్యంత అవినీతి ప్రభుత్వం అని విమర్శించారు.
కెసిఆర్ ప్రభుత్వం చేసింది 4 పనులు మాత్రమేనని పేర్కొంటూ ఉదయం, సాయంత్రం మోదీని, కేంద్ర ప్రభుత్వాన్ని దుర్భాషలాడటం.. ఒక కుటుంబాన్ని అధికార కేంద్రీకృతం చేసి తెలంగాణకు వారే యజమాని అని నిరూపించుకోవడం.. తెలంగాణ ఆర్థికాభివృద్ధిని అడ్డుకోవడం.. తెలంగాణను అవినీతిలో ముంచడం అని మోదీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
కుటుంబ పార్టీలన్నింటికీ అవినీతి పునాది ఉందని తెలంగాణ ప్రజలు గమనించాలని ప్రధాని కోరారు. గత 9 సంవత్సరాలలో మొత్తం ప్రపంచంలో భారతదేశం గర్వం పెరిగిందని,.అందరూ భారతదేశం వైపు చూస్తున్నారని.. దీని వల్ల తెలంగాణ కూడా లాభపడిందని తెలిపారు. గతంలో కంటే ఎక్కువగా పెట్టుబడులు వస్తున్నాయని, తెలంగాణ యువత దీని వల్ల లబ్ది పొందుతున్నారని, వారికి ఉద్యోగాలు లభిస్తున్నాయని ప్రధాని వివరించారు.
ఎక్కడైనా అభివృద్ది కోసం రాష్ట్రాలు కలిసి పనిచేస్తాయని, కానీ అవినీతి కోసం ఢిల్లీ, తెలంగాణ ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయని ప్రధాని విమర్శించారు. ఇందుకోసమేనా తెలంగాణ యువత ఆత్మబలిదానాలు చేసిందని? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం 9 ఏళ్లలో ఏం చేసిందో చెప్పాలని ప్రధాని నిలదీశారు.
ఉద్యోగాల పేరుతో యువతను మోసం చేశారని చెబుతూ టీఎస్పీఎస్సీ స్కామ్‌తో యువత ఎంతో నష్టపోయారని చెప్పారు. కాంగ్రెస్ అయినా, బిఆర్ఎస్ అయినా తెలంగాణ ప్రజలకు రెండూ ప్రాణాంతకమే అని ప్రధాని హెచ్చరించారు. ఈ రెండింటి నుంచి తెలంగాణ ప్రజలను కాపాడాలని కోరారు. తెలంగాణ వర్సిటీల్లో మూడువేల అధ్యాపక పోస్టులు భర్తీ చేయలేదని విమర్శించారు.
రాష్ట్రంలో 15 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెబుతూ పోస్టులు భర్తీ చేయకుండా విద్యార్థులకు ద్రోహం చేస్తున్నారని ప్రధాని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వంపై సర్పంచ్‌లు ఆగ్రహంగా ఉన్నారని పేర్కొంటూ కేంద్రం గత తొమ్మిదేళ్లలో గ్రామ పంచాయతీలకు ఇచ్చిన లక్ష కోట్లకుపైగా నిధులను పక్కదారి పట్టించారని మోదీ ఆరోపించారు.
ఎస్సీలు, ఎస్టీలు, పేదలను కేసీఆర్ ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు. ఆదివాసీ గ్రామాలకు ఎలాంటి మౌళిక సౌకర్యాలు కల్పించట్లేదని చెబుతూ “మేం ఆదివాసీ ప్రాంతాల్లో ఆరులైన్ల రహదారులు వేస్తున్నాం. మేం మద్దతు ధర ఇస్తామని చెప్పి.. చేసి చూపించాం. తెంలగాణకు మెగా టెక్స్టైల్స్ పార్క్ ఇచ్చాం. బీజేపీ ద్వారానే తెలంగాణ అభివృద్ధి సాధ్యం.” అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.