పాకిస్థాన్‌కు చెందిన మహిళా నిఘా ఏజెంట్ ఆకర్షణకు గురై భారత రక్షణ రంగానికి చెందిన అత్యంత రహస్యమైన క్షిపణి వ్యవస్థ రహస్యాలను చేరవేస్తున్నాడనే ఆరోపణలపై డీఆర్డీవో శాస్త్రవేత్త ప్రదీప్ కురుల్కర్ ఇటీవల అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో తాజాగా మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్కాడ్ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్ లో సంచలన విషయాలు వెలుగు లోకి వచ్చాయి.
పాక్ నిఘా ఏజెంట్ వలపు వలలో పడిన ఆయన, ఆమెకు అత్యంత రహస్య విషయాలు పంపినట్టు పోలీస్‌లు తెలిపారు. ఛార్జ్‌షీట్‌లో ఉన్న వివరాల ప్రకారం ప్రదీప్ కురుల్కర్ మహారాష్ట్ర లోని పుణెలో గల రక్షణ పరిశోధన అభివృద్ధి (డీఆర్డీవో) ల్యాబ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. గత ఏడాది ఆయనకు జారా దాస్‌గుప్తా పేరుతో ఓ మహిళ పరిచయమైంది.
తానో సాఫ్ట్వేర్ ఇంజినీర్ అని, బ్రిటన్‌లో పనిచేస్తున్నానని చెప్పింది. ఆ తర్వాత ఆయనకు అశ్లీల వీడియోలు, మెసేజ్‌లు పంపి క్రమంగా స్నేహం పెంచుకుంది. వీరిద్దరూ వాట్సాప్‌లో వాయిస్, వీడియో కాల్స్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఆమెకు ఆకర్షితుడైన ప్రదీప్, భారత క్షిపణి వ్యవస్థకు చెందిన అత్యంత రహస్య సమాచారం, రక్షణరంగ ప్రాజెక్టుల సమాచారం ఇచ్చినట్టు పోలీస్‌లు వెల్లడించారు.
డ్రోన్లు, క్షిపణులు, బ్రహ్మోస్, అగ్ని మిసైల్ లాంచర్లు, యూసీవీ, మిలిటరీ బ్రిగేడింగ్ సిస్టమ్ వంటి పలు రక్షణరంగ ప్రాజెక్టుల గురించి వీరిద్దరూ చాటింగ్ చేసినట్టు పోలీస్‌ల దర్యాప్తులో తేలింది. ఈ ప్రాజెక్టులకు సంబంధించి తన వ్యక్తిగత ఫోన్లో ఉన్న సమాచారాన్ని ప్రదీప్ ఆమెకు పంపినట్లు తెలిసింది.
2022 జూన్ నుంచి డిసెంబరు మధ్య వీరిద్దరూ చాటింగ్ చేసుకున్నట్టు ఛార్జిషీట్లో పేర్కొన్నారు. ఆయన కార్యకలాపాలపై అనుమానం రావడంతో డీఆర్డీఓ అంతర్గత దర్యాప్తు చేపట్టింది. ఈ విషయం తెలియగానే ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రదీప్, జారా నంబరును బ్లాక్ చేసినట్టు తెలిసింది.
అధికారిక షెడ్యూళ్లు, లొకేషన్లకు సంబంధించిన కీలక సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దని తెలిసినా ప్రదీప్ ఆ విషయాలను జారాతో చెప్పినట్టు ఏటీఎస్ అధికారులు దర్యాప్తులో గుర్తించారు.
ఐపీ అడ్రసు ద్వారా ఆమె నంబరును ట్రేస్ చేయగా, పాకిస్థాన్ నుంచి చాట్ చేసినట్టు తెలిసింది. ఆమె పాక్ నిఘా సంస్థకు చెందిన ఏజెంట్‌గా గుర్తించిన అధికారులు, ఈ ఏడాది మే 3 న ప్రదీప్‌ను అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.