ఉత్తర భారత్‌లో పలు రాష్ట్రాల్లో గత 24 గంటలుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు 22 మంది మరణించారు. కోట్లాది రూపాయల విలువైన ఆస్తులు ధ్వంసమైపోయాయి. హిమాచల్‌ప్రదేశ్‌లో పెద్ద ఎత్తున కొండచరియలు విరిగిపడ్డాయి. బ్రిడ్జీలు, కార్లు వరద నీటిలో కొట్టుకుపోయాయి.
దేశ రాజధాని ఢిల్లి 1982 నాటి నుంచి అత్యధికంగా ఒక్కరోజులోనే 153 మి.మీ.ల వర్షపాతాన్ని నమోదు చేసుకుంది. హిమాచల్‌ప్రదేశ్‌లో కొండచరియలు విరిగిపడటంతో అనేక ఇళ్ళు, ఇతర నిర్మాణాలు పెద్ద తిన్నాయి. ఐదుగురు మరణించారు. ఉత్తరాఖండ్‌లో ఒక కారుపై కొండచరియ విరిగిపడింది. దీంతో కారు గంగా నదిలో కొట్టుకుపోవడంతో ముగ్గురు వ్యక్తులు మరణించారు.
జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో మెరుపు వరదలకు శనివారం సాయంత్రం ఇద్దరు జవాన్లు వరద నీటిలో కొట్టుకుపోయారు. రాజస్థాన్‌లోని పలు జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు వేర్వేరు ఘటనల్లో నలుగురు మరణించారు. చిత్తోడ్గఢ్లో పిడుగు పడి ఒక పురుషుడు, ఒక మహిళ మరణించగా, సవాయ్ మధోపూర్‌లో రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు వ్యక్తులు వరదనీటిలో గల్లంతైపోయారు.
వర్షాలపై భారత వాతావరణ విభాగం ఆదివారం జారీ చేసిన ఒక బులెటిన్‌లో ”వాయువ్య భారత్‌లో జులై 9, 10 తేదీల్లో పశ్చిమ హిమాలయ ప్రాంతం, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లి, రాజస్థాన్‌లో ఒక మోస్తరు నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. ఉత్తరప్రదేశ్‌లో వచ్చే ఐదు రోజులు వర్షాలు కురుస్తాయి. జులై 9న ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, పొరుగునే ఉన్న పంజాబ్, హర్యానా-చండీగఢ్‌కు చెందిన జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయి. జులై 10 నుంచి 13వ తేదీ వరకు ఉత్తరప్రదేశ్ అంతటా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి” అని సూచించింది.
భారీ వర్షాలకు హిమాచల్‌ప్రదేశ్ తల్లడిల్లిపోయింది. పెద్ద ఎత్తున కొండచరియలు విరిగిపడ్డాయి. ఇళ్ళు దెబ్బతిన్నాయి. ఐదుగురు వ్యక్తులు మరణించారని అధికారులు ఆదివారం తెలిపారు. స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ ప్రకారం గడచిన 36 గంటల్లో రాష్ట్రంలో 13 కొండచరియలు విరిగిపడగా, తొమ్మిది మెరుపు వరదలు చోటు చేసుకున్నాయి.
6 మైల్ అనే పేరున్న ప్రాంతం వద్ద 21వ నంబరు జాతీయ రహదారి దిగ్బంధానికి గురైంది. ఘోడా ఫామ్ సమీపంలో మండి-కుల్లు రోడ్డు దిగ్బంధానికి గురైంది. మనాలీ వద్ద మనాలీ-చండీగఢ్ రహదారి కుప్పకూలింది. మనాలీలో దుకాణాలు వరదనీటికి కొట్టుకుపోయాయి. కుల్లు, కిన్నావర్, చాంబాలో మెరుపు వరదలకు వాహనాలు కొట్టుకుపోయాయి. పంట పొలాలు నీటమునిగిపోయాయి.
ఆదివారం ఉదయం 8.30 గంటలకు గత 24 గంటల్లో 153 మి.మీ.ల వర్షపాతాన్ని ఢిల్లి నమోదు చేసింది. ఇది 1982 నుంచి జులై మాసంలో ఒక్క రోజులో నమోదైన అత్యధికంగా వర్షపాతంగా నగరంలో ప్రధాన వాతావరణ కేంద్రం ది సఫ్దర్‌జంగ్ అబ్జర్వేటరీ రికార్డు చేసింది. 1982 జులై 25న 24 గంటల్లో 169.9 మి.మీ.ల వర్షపాతాన్ని దేశరాజధాని నమోదు చేసుకుందని సంబంధిత అధికారులు తెలిపారు.
ప్రస్తుతం నమోదైన వర్షపాతం 1958 నుంచి జులై మాసంలో అత్యధిక వర్షపాతం నమోదైన మూడవ రోజు అని చెప్పారు. ప్రభుత్వ అధికారులు సండే హాలిడేను సీఎం అరవింద్ కేజ్రీవాల్ రద్దు చేశారు. సహాయక చర్యలను చేపట్టాల్సిందిగా ఆదేశించారు.