ఎన్నికలు ఎప్పుడు జరిగినా గెలుపే లక్ష్యంగా పార్టీని సన్నద్ధం చేయాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పిలుపిచ్చారు. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీని బలోపేతం చేయడమే లక్ష్యంగా కృషి చేయాలని సూచించారు. పార్టీని క్షేత్ర స్థాయి నుంచి బలోపేతం చేయాలని నడ్డా, బిఎల్.సంతోష్‌లు సూచించారు.
దక్షిణాది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో పాటు 11 రాస్త్రాల రాష్ట్ర అధ్యక్షులు, ఇన్ఛార్జిలతో పార్టీ కార్యాలయంలో కీలక సమావేశాన్ని హైదరాబాద్ లో ఆదివారం నిర్వహించారు. తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కేరళ, తమిళనాడు, కర్ణాటక, పుదుచ్చేరి రాష్ట్రాల్లో బీజేపీని బలోపేతం చేయడంపై ప్రధానంగా చర్చించారు.
ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగే తెలంగాణతో పాటు వచ్చే ఏడాది ఎన్నికలు జరిగే ఆంధ్రప్రదేశ్‌తో పాటు పార్లమెంటు ఎన్నికల్లో విజయం సాధించాలని సూచించారు. దక్షిణాది రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల్లో అత్యధిక స్థానాలు సాధించడం అవసరమని పార్టీ నేతలకు మార్గనిర్దేశం చేశారు.
రాష్ట్రాల వారీగా ఉదయం నుంచి బీజేపీ అగ్రనేతలు ఉత్తరాది రాష్ట్రాల్లో విజయవంతం అవుతున్న బీజేపీ వ్యూహాలు దక్షిణాది రాష్ట్రాల్లో ఎందుకు సత్ఫలితాలను ఇవ్వడం లేదనే అంశంపై సుదీర్ఘంగా చర్చించారు.
కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలవడం ఇతర దక్షిణాది రాష్ట్రాలపై ప్రభావం చూపుతోందని దీనిని ఎదుర్కోడానికి రాష్ట్రాల వారిగా అవసరమైన అంశాలను సిద్ధం చేయాలని రాష్ట్ర పార్టీ నాయకులకు ఆ పార్టీ అగ్రనేలు సూచించారు. బూత్ కమిటీలను ఏర్పాటు చేయడం, వాటి ద్వారా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై ప్రధానంగా చర్చించారు.
తెలంగాణలో గెలుపే లక్ష్యం
తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా నేతలంతా కలిసికట్టుగా ముందుకుసాగాలని జేపీ నడ్డా సూచించారు. నాయకులంతా క్రమశిక్షణకు కట్టుబడి ఉండాలని.. ఎట్టి పరిస్థితుల్లోనూ పరస్పర ఆరోపణలతో పార్టీకి నష్టం కలిగించవద్దని స్పష్టం చేవారు. అలాంటివి సహించబోమని స్పష్టం చేశారు.
ఇటీవలి పార్టీలో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర నేతలను నడ్డా తీవ్రస్థాయిలోనే హెచ్చరించారు. ఆదివారం రాత్రి శంషాబాద్‌లోని నోవాటెల్‌లో రాష్ట్ర భాజపా ముఖ్యనేతలతో నడ్డా ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో కిషన్‌రెడ్డి, ప్రకాశ్ జావడేకర్, తరుణ్ ఛుగ్, సునీల్ బన్సల్, బండి సంజయ్, కె.లక్ష్మణ్, ఈటల రాజేందర్, డీకే అరుణ, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సహా ముఖ్యనేతలు పాల్గొన్నారు.
రాష్ట్రంలో ఎన్నికల కార్యాచరణను అంతా కలిసి అమలు చేయాలని నడ్డా సూచించారు. గతంలో ఎన్నడూ లేనంతగా.. బీజేపీ అంతర్గత అంశాలు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారడం ఆమోదయోగ్యం కాదన్నారు. పార్టీ అగ్రనేతల పర్యటనలు క్రమం తప్పకుండా ఉంటాయని.. అన్ని ప్రాంతాలను దృష్టిలో ఉంచుకుని వీటిని ఏర్పాటు చేయాలని సూచించారు. ఇన్‌ఛార్జులు పూర్తిగా అందుబాటులో ఉంటూ పార్టీ వ్యవహారాలు సజావుగా సాగేలా చూడాలన్నారు.