ప్రధాని నరేంద్ర మోదీకి మరో అరుదైన గౌరవం దక్కింది. ఫ్రాన్స్‌లో పర్యటిస్తున్న ప్రధానికి ఆ దేశ అత్యుతన్నత గౌరవ పురస్కారం లభించింది. ప్రధాని మోదీకి దేశాధ్యక్షుడు మాక్రాన్ ‘గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లిజియన్ ఆఫ్ హానర్’ను అందించారు. ఎలిసీ ప్యాలెస్‌లో ఏర్పాటు చేసిన విందులో ఈ పురస్కారాన్ని అందజేశారు.
ఫ్రాన్స్ మిలిటరీ, పౌర పురస్కారాల్లో ఇదే అత్యుత్తమైనది. ఇక ఓ దేశ ప్రధానికి ఈ గౌరవం దక్కడం ఇదే తొలిసారి కావడం విశేషం. దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా, కింగ్ చార్లెస్, ఫ్రాన్స్ మాజీ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్, ఐక్యరాజ్యసమితి మాజీ కార్యదర్శి బుట్రోస్ ఘాలీలు గతంలో ఈ పురస్కారం అందుకున్నారు.
‘ప్రధాని మోదీకి ఫ్రాన్స్ దేశ అత్యున్నత పురస్కారమైన గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లిజియన్ ఆఫ్ హానర్‌ను ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ అందించారు. కోట్లాది మంది భారతీయుల తరఫున మేక్రాన్‌కు మోదీ కృతజ్ఞతలు తెలిపారు’ అంటూ భారత విదేశాంగశాఖ ట్వీట్ చేసింది. మరోవంక, నౌకల నుండి ప్రయోగించగల రాఫెల్ జెట్లను, స్కార్పియన్ జలాంతర్గాములను ఫ్రాన్స్ నుండి కొనుగోలు చేయడానికి భారత్ గురువారం ఆమోద ముద్ర వేసింది.
రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని మోదీ పారిస్ చేరుకున్నారు. తొలుత ఆయన ఫ్రాన్స్ ఎగువ సభ (సెనెట్) అధ్యక్షులు గెరార్డ్ లార్చర్‌తో గురువారం సాయంత్రం సమావేశమయ్యారు. అంతుకుముందు ఆయనకు పారిస్ విమానశ్రయంలో ఫ్రాన్స్ ప్రధానమంత్రి ఎలిజిబెత్ బోర్నే స్వాగతం పలికారు.
ఫ్రాన్స్ అధ్యక్షులు ఎమ్మాన్యుల్ మాక్రాన్‌తో కలిసి శుక్రవారం జరిగే ఫ్రెంచ్ జాతీయదినోత్సవ వేడుకల్లో పాల్గంటారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలూ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఫ్రాన్స్ నుంచి 26 రాఫెల్ జెట్లు, 3 స్కార్పియన్ జలాంతర్గాముల కొనుగోలు చేయాలని భారత్ ఇదివరకే నిర్ణయించింది.
మోదీ ఫ్రాన్స్ పర్యటన నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో సమావేశమైన డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (డిఎసి) 26 రాఫెల్ జెట్లు, మూడు స్కార్పియన్ జలాంతర్గాములు కొనుగోలు ప్రతిపాదనలను ఆమోదించిందని మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. 26 జెట్ల్లో నాలుగు శిక్షణా విమానాలుగా వుంటాయని ఆ వర్గాలు చెప్పాయి.
కాంట్రాక్టుపై సంతకం చేసిన మూడేళ్ళ వ్యవధిలో విమానాలను అందచేయం ఆరంభమవుతుంది. అయితే వీటి ధరపై ఇంకా చర్చలు జరగాల్సి వున్నందున తుది ఒప్పందం కుదరడానికి దాదాపు ఒక సంవత్సరం పడుతుంది. భారత నావికాదళానికి అవసరమైన 26 రాఫెల్ జెట్లతో పాటూ వాటితో ముడిపడిన ఇతర అనుబంధ పరికరాలు, ఆయుధాలు, సిమ్యులేటర్, ఫ్రెంచి ప్రభుత్వం నుండి అందాల్సిన లాజిస్టిక్ సపోర్టు, సిబ్బంది శిక్షణ, విడిభాగాలు, అన్నింటినీ ఫ్రెంచి ప్రభుత్వం నుండి పొందడానికి డిఎసి ఆమోదం తెలిపిందని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి.
