అసోంలో కూరగాయాల ధరలు ఆకాశాన్నంటడం రాజకీయ దుమారం రేపుతోంది. అందుకు ‘మియా’(బెంగాలీ మాట్లాడే ముస్లిం వ్యాపారులు)లే కారణమంటూ అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అధికార, ప్రత్యర్థి పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారితీస్తుంది.
గౌహతిలో కూరగాయల ధరలు పెరిగిపోవడంపై మూడు రోజుల క్రితం విలేఖరులు అడిగిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్పందిస్తూ, కూరగాయల ధరలు పెరగడానికి మియాలే కారణమని విమర్శించారు. అసోం వ్యాపారులు గనుక కూరగాయలు అమ్ముతున్నట్లయితే ఇంతగా ధరలు పెరిగేవి కావని ఆయన చెప్పారు.
‘గ్రామీణ ప్రాంతాలలో రైతులు విక్రయించే కూరగాయల ధరలు ఎక్కువగా లేవు. అయితే అవే కూరగాయలను గ్రామాల నుండి కొనుగోలు చేసి గౌహతికి తీసుకొచ్చి అమ్మితే ధరలు పెరిగిపోతున్నాయి. కూరగాయలను అధిక ధరలకు అమ్మే వారు ఎవరు? వారు మియా వ్యాపారులు. వారే ఎక్కువ ధరకు అమ్ముతున్నారు’ అని తెలిపారు.
అంతేకాదు గౌహతిలోని ఫుట్పాలన్నిటినీ ఖాళీ చేయిస్తానని చెబుతూ తమ వ్యాపారాలు చేసుకోవడానికి అసోం వ్యాపారులు ముందుకు రావాలని కూడా ఆయన కోరారు. అసోంలో బెంగాలీ మాట్లాడే ముస్లింలు ఎక్కువగా వ్యవసాయ కార్యకలాపాల్లో నిమగ్నమై ఉంటారు. వీరిని అక్కడ ‘మియాలుగా పిలుస్తారు.
అయితే ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను ప్రతిపక్ష ఆలిండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్(ఎఐయుడిఎఫ్) అధ్యక్షుడు బద్రుద్దీన్ అజ్మల్ తీవ్రంగా ఖండించారు. ‘ఇది మతాల మధ్య విభేదాలను సృష్టిస్తుంది. ఏదయినా అవాంఛనీయ ఘటన జరిగితే దానికి రాష్ట్రప్రభుత్వం, ముఖ్యమంత్రే బాధ్యులవుతారు’ అని లోక్సభ ఎంపి కూడా అయిన అజ్మల్ స్పష్టం చేశారు.
అంతేకాదు కూరగాయల ధరలు మియాల కంట్రోల్లో ఉండవని కూడా ఆయన చెప్పారు. అస్సామీ యువకులు వ్యవసాయ పనులు చేపడితే తాము సంతోషిస్తామని ఆయన అంటూ, అయితే దానికి ఎక్కువ శ్రమపడాల్సి ఉంటుంది కనుక వారు ఆ పని చేస్తారని తాను అనుకోవడం లేదని కూడా ఆయన తెలిపారు.
ఇలా ఉండగా, వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో శర్మ, అజ్మల్లు కుమ్మక్కయి అస్సామీ- బెంగాలీ వివాదాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు భూపేన్ కుమార్ బోరా ఆరోపించారు. బిజెపి నిరుద్యోగం, ధరల పెరుగుదల,అక్రమ వలసలు లాంటి ముఖ్యమైన సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని, అందుకే ఆ పార్టీ ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ఆయన విమర్శించారు.
ముఖ్యమైన సమస్యలనుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే ముఖ్యమంత్రి ఇలాంటి మతపరమైన ప్రకటనలు చేస్తున్నారని రాయిజోర్ దళ్ అధ్యక్షుడు, ఎంఎల్ఎ అఖిల్ గొగోయ్ విమర్శించారు. తన వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికే బిజెపి ఇలాంటి మతపరమైన రాజకీయాలకు పాల్పడుతోందని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతినిధి హేమంత ఫుకాన్ కూడా ఆక్షేపించారు.