‘‘రాష్ట్రం అరాచకాంధ్రను తలపిస్తోంది. అత్యాచారాలు, హత్యలు, మద్యం మాఫియా, మైనింగ్ మాఫియా, భూ కబ్జాలు, ప్రశ్నిస్తే దాడులు. ఎన్నో హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన జగన్ రూ.10 లక్షల కోట్ల అప్పు 5కోట్ల మంది నెత్తిన పెట్టారు. ధరలు, పన్నుల బాదుడుతో ప్రజల్ని పీల్చి పిప్పిచేస్తున్నారు. ఇలాంటి సమయంలో బీజేపీ ప్రజల పక్షాన నిలబడాలి. నాతో సహా ప్రతి కార్యకర్త గట్టిగా పనిచేయాల్సిందే” అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పార్టీ శ్రేణులకు పిలుపిచ్చారు.
రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన ఆమె విజయవాడలోని పార్టీ కార్యాలయంలో మొదటిసారి ఆదివారం ఏర్పాటు చేసిన రాష్ట్ర పదాధికారుల సమావేశంలో అన్ని జిల్లాల నుంచి వచ్చిన పార్టీ నేతలను ఉద్దేశించి మాట్లాడుతూ వైసీపీ మేనిఫెస్టో ప్రతి ఒక్కరూ చదవాలి. అందులో అమలు చేయని వాటిని డిమాండ్ చేస్తూ కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు.
ఆంధ్రులు ఆవేదన, ఆందోళనతో ఉన్నారని, రాష్ట్రంలోని ఏ వర్గమూ గుండెలపై చేయి వేసుకునే పరిస్థితి లేదని ఆమె స్పష్టం చేశారు. 90 శాతానికి పైగా హామీలు అమలు చేశామని పాలకులు ప్రచారం చేసుకొంటున్నా వాస్తవం అందుకు పూర్తి భిన్నంగా ఉందని ఆమె విమర్శించారు. క్షేత్రస్థాయిలో వాస్తవాలను ప్రజలకు వివరించాలని ఆమె చెప్పారు.
ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో అంతకు రెట్టింపు లాక్కొంటున్న విషయాన్ని విపులీకరించాలని చెబుతూ ఆమె పలు ఉదాహరణలను సమావేశంలో పేర్కొన్నారు. రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ రాలేదని చెపుతూ, ఉన్నవి కూడా వైసీపీ బెదిరింపులతో పొరుగు రాష్ట్రాలకు తరలిపోయిన తీరును కళ్లకు కట్టారు.
నిరుద్యోగం ప్రబలటం, భవన నిర్మాణ కార్మికులతో సహా వివిధ రంగాల కార్మిక కర్షక వర్గం కునారిల్లుతున్న తీరును విడమర్చి ఆమె చెప్పారు. గత ప్రభుత్వం నిర్మించిన ఇళ్లకు రంగులేసుకున్న జగన్ కేంద్రం ఇళ్లు ఇస్తున్నా నిర్మించే పరిస్థితుల్లో లేదని పురందేశ్వరి ధ్వజమెత్తారు.
రైల్వే ప్రాజెక్టులకు తన వాటా 30 శాతం కూడా ఇవ్వలేని దారుణమైన స్థితిలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉందని ఆమె ఎండగట్టాయిరు. ప్రభుత్వ ఉద్యోగుల నుంచి పంచాయతీల వరకూ రాష్ట్రంలో ఎవ్వరిని కదిపినా అసంతృప్తే వ్యక్తం అవుతోందని ఆమె తెలిపారు.
రాష్ట్రాన్ని జగన్ నాశనం చేస్తున్న విధానాన్ని ప్రజలకు వివరిస్తూనే రాష్ట్రానికి కేంద్రం చేసిన సహాయాన్ని, ప్రపంచ దేశాల్లో భారత ఖ్యాతిని నరేంద్ర మోదీ ఇనుమడింపజేస్తోన్న తీరును తెలియజేయాలని పార్టీ శ్రేణులకు ఆమె దిశానిర్దేశం చేశారు. రాబోయే ఆరు నెలలు ఎంతో కీలకమని చెబుతూ పార్టీని బలోపేతం చేసుకునేలా ప్రజల తరఫున పోరాటానికి దిగాలని కోరారు.
రాష్ట్ర ఇన్చార్జి మురళీధరన్ ముందుగా కమిటీలు ఏర్పాటు చేసుకుని పార్టీని బలోపేతం చేస్తే ప్రజల్లోకి మరింత వేగంగా వెళ్లొచ్చని తెలిపారు. పార్టీ పేరులో రైతును పెట్టుకున్న జగన్ పాలనలో అన్నదాతల ఆత్మహత్యల్లో రాష్ట్రం అగ్రస్థానానికి చేరుకోవడం సిగ్గు చేటని మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ విమర్శించారు.
“ఈ నెల 23న పొద్దుటూరు, 25న గుంటూరు, 26న రాజమహేంద్రవరం, 27న విశాఖపట్నంలో పార్టీ శ్రేణులతో అధ్యక్షురాలు సమావేశమై ప్రజల తరఫున పోరాటం చేసేందుకు దిశా నిర్దేశం చేస్తారు’’ అని మాధవ్ తెలిపారు.