కేంద్ర నిఘా సంస్థలు కట్టుదిట్టంగా తమపై నిఘా ఉంచుతూ ఉండడంతో, నిషేధం విధించడానికి అదను కోసం కేంద్ర ప్రభుత్వం ఎదురు చూస్తున్నదనే అనుమానంతో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) కొత్త వ్యూహాలకు పదును పెడుతోంది.
జాతీయ మీడియా కథనాల ప్రకారం, నిషిద్ధ సిమి ఉగ్రవాద సంస్థ తరపున పీఎఫ్ఐ పని చేస్తోంది. ఇప్పుడు దీనిపై కూడా నిషేధం విధించే అవకాశాలు ఉన్నట్లు భావించి, దేశవ్యాప్తంగా సంక్షేమ సొసైటీలను ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తోంది.
వీటికి వేర్వేరు పేర్లు పెట్టాలని యోచిస్తోంది. వీటన్నిటి ఎజెండా ఒకటే ఉంటుంది. వీటిని స్థానిక రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ కూడా చేయిస్తుంది. పీఎఫ్ఐ అగ్ర నాయకత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
భారత వ్యతిరేక కార్యకలాపాలు, ఇస్లామిక్ రాడికలైజేషన్ వంటివాటికి పీఎఫ్ఐ పాల్పడుతోందని గతంలో ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), రాష్ట్ర పోలీసులు సహా ఇతర ప్రభుత్వ వ్యవస్థలు పీఎఫ్ఐపై కేసులు నమోదు చేశాయి.
పీఎఫ్ఐ కేరళ కేంద్రంగా పని చేస్తోంది. రాజకీయ హత్యలు, మత మార్పిడులు, ఉగ్రవాద కార్యకలాపాలకు ఈ సంస్థ పాల్పడుతున్నట్లు చాలా ఆరోపణలు ఉన్నాయి.
కేరళలోని కొజిక్కోడ్‌లో ఎనిమిది మంది హిందువులను హత్య చేయడం, అల్లర్లకు పాల్పడటం వంటి నేరాలపై ఈ సంస్థకు చెందిన కొందరు సభ్యులను 2003లో అరెస్టు చేశారు. దీంతో ఈ సంస్థ తీవ్రవాద స్వభావం బయటకు వెల్లడైంది. దీనిపై నిషేధం విధించాలని ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రాన్ని కోరింది.
ఇటీవల, కర్ణాటకలోని ఉప్పినంగడిలో పోలీసు సిబ్బందిపై దాడికి పాల్పడిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్ఐ)ను నిషేధించాలని విశ్వహిందూ పరిషత్ ప్రభుత్వాన్ని కోరారు. ప్రజల భద్రత కోసం అహోరాత్రులు శ్రమిస్తున్న పోలీసులపై దాడి క్షమించరానిదని వీహెచ్‌పీ డివిజన్ కార్యదర్శి శరణ్ పంప్‌వెల్ విమర్శించారు.
దక్షిణ కన్నడకు చెందిన బిజెపి శాసనసభ్యులు, మంత్రి ఎస్. అంగార, హరీష్ పూంజా, సంజీవ్ మాతాండూర్, రాజేష్ నాయక్, భరత్ శెట్టి, ఉమానాథ్ కోటియన్, ప్రతాప్‌సింహా నాయక్‌లు పిఎఫ్ఐ, దాని కార్యకర్తలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బెలగావిలో హోం మంత్రి అరగ జ్ఞానేంద్రను కలిశారు.
మత సామరస్యానికి భంగం కలిగించేందుకు కేరళకు చెందిన కొందరు స్వార్థ ప్రయోజనాలు దక్షిణ కన్నడలో ప్రజలతో చేతులు కలుపుతున్నారని, అలాంటి అంశాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని వారు మంత్రికి సూచించారు.