అవినీతి ఉద్దేశంతో కూటమి ఏర్పడినప్పుడు, కులతత్వాన్ని, ప్రాంతీయతను దృష్టిలో ఉంచుకుని పొత్తు పెట్టుకున్నప్పుడు, బంధుప్రీతి విధానంలో పొత్తు పెట్టుకున్నప్పుడు అలాంటి కూటములు దేశానికి ప్రమాదకరమని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు.
బెంగళూరులో 26 ప్రతిపక్ష పార్టీల నేతలు సమావేశమై ఎన్డీయేను ఎదుర్కోవడానికి `ఇండియా’ పేరుతో కొత్త కూటమిని ప్రకటించిన కొద్దిసేపటికే ఢిల్లీలో జరిగిన ఎన్డీయే భేటీలో మాట్లాడుతూ ప్రతికూల అవగాహనతో ఏర్పడిన పొత్తులు ఎప్పుడూ విఫలమవుతాయని స్పష్టం చేశారు.
మన దేశంలో రాజకీయ సంకీర్ణాలకు సుదీర్ఘ చరిత్ర ఉందని, కానీ ప్రతికూలతపై నిర్మించబడిన ఏ సంకీర్ణం ఎప్పుడూ విజయవంతం కాలేదని ప్రధాని గుర్తు చేశారు. ప్రభుత్వాలను పడగొట్టడానికి కాంగ్రెస్ పార్టీ సంకీర్ణాలను ఉపయోగించుకుంటోందని ప్రధాని ఆరోపించారు. 90వ దశకంలో దేశంలో అస్థిరతను తీసుకురావడానికి కాంగ్రెస్ కుట్రలను ఉపయోగించిందని విమర్శించారు.
1998లో ఎన్‌డిఎ ఒకరిని అధికారం నుంచి తరిమికొట్టేందుకు కాకుండా దేశంలో సుస్థిరత తీసుకురావడానికి ఏర్పడిందని ప్రధాని గుర్తు చేశారు. దేశ ప్రజల పురోగతికి ఎన్డీయే కట్టుబడి ఉందని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. దేశం యొక్క పురోగతి, భద్రత, ప్రజల సాధికారత తమ సిద్ధాంతమని, అదే తమ ప్రధాన ప్రాధాన్యత అని పేర్కొన్నారు. ప్రజల సాధికారత కోసం తాము ఏ ఒక్క అవకాశాన్ని వదలిపెట్టలేదని స్పష్టం చేశారు.
2024లో ఎన్డీయే ఓట్ల శాతం 50 శాతానికి పైగా ఉంటుందని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధి పేరుతో అన్ని పార్టీలు ఓట్లు అడగాలని చెబుతూ భారతదేశం ఎన్డీయే మూడవ పదవీకాలంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్డీయేలోకి కొత్తగా చేరిన వారిని ప్రధాని మోదీ స్వాగతించారు.
ప్రతిపక్షాల కూటమి దేశాన్ని బలోపేతం చేసేందుకు కాదని, తమను తాము కాపాడుకోవాల్సిన తప్పని పరిస్థితుల్లో వారు ఏకమవుతున్నారని ప్రధాని ధ్వజమెత్తారు. అవినీతి, కుటుంబ పాలన, ప్రాంతీయవాదం, కులతత్వంతో కూడిన పార్టీలు కలిస్తే దేశానికి నష్టం కలుగుతుందని స్పష్టం చేశారు.
1990లలోనూ కాంగ్రెస్ పార్టీ పలు కూటములను ఏర్పాటు చేసి దేశంలో అస్థిరత సృష్టించిందని, ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం, కూలదోయడం చేసిందని ప్రధాని ఆరోపించారు. కానీ, ఎన్డీఏ కూటమి మాత్రం ఎవరినో గద్దె దించేందుకు ఏర్పడలేదని, దేశంలో స్థిర త్వాన్ని తెచ్చేందుకు, ప్రజలందరినీ ఏకం చేసేందుకే ఏర్పడిందని తెలిపారు. ఎన్డీఏ పక్షాల కూటమిని ‘జాతీయ ఆకాంక్షల ఇంద్రధనస్సు’గా ప్రధాని అభివర్ణించారు.
ఎన్ అంటే న్యూ ఇండియా, డి అంటే డెవలప్డ్ నేషన్, ఏ అంటే ఆస్పిరేషన్ ఆఫ్ పీపుల్ ఆఫ్ ఇండియా అని నిర్వచించారు. ఎన్డీఏ ప్రయాణంలో భాగస్వాములైన ఎల్కే ఆడ్వాణీ, బాలాసాహెబ్ ఠాక్రే, ప్రకాశ్‌సింగ్ బాదల్‌ను మోదీ గుర్తు చేసుకున్నారు.