కర్ణాటక బెంగళూరుకు చెందిన ఐదుగురు అనుమానిత ఉగ్రవాదులను సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ అరెస్టు చేసింది. వారి నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలతో పాటు, పేలుడుకు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాదులను సయ్యద్ సుహైల్, ఉమర్, జానీద్, ముదాసిర్, జాహిద్‌గా గుర్తించారు.
పక్కాగా అందించిన సమాచారం మేరకు కర్నాటక సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఉదయం ఉగ్రవాదులు ఉన్న స్థావరంపై దాడి చేశారు. ఐదుగురిని అరెస్టు చేశారు. 2017 లో ఒక హత్య కేసులో దోషులుగా బెంగళూరు సెంట్రల్ జైళ్లో ఉన్న సమయంలో వీరికి ఉగ్రవాదులతో పరిచయమైందని, ఆ తర్వాత ఉగ్రవాదుల సూచనల మేరకు బెంగళూరులో వరుస పేలుళ్లు జరిపి విధ్వంసం సృష్టించాలని కుట్ర చేసినట్లుగా సీసీబీ పోలీసులు భావిస్తున్నారు.
గ్రూప్‌నకు ఎవరైనా సహకరిస్తున్నారా? పేలుళ్లను ఎక్కడ..? ఎలా ప్లాన్ చేశారు? అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. ఇక ఉగ్రవాదుల నుంచి ఏడు పిస్టల్స్, భారీగా లైవ్ బుల్లెట్స్, వాకీటాకీలు, నాలుగు గ్రనేడ్లు, శాటిలైట్ ఫోన్స్, ఇతర పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. మరో ఐదుగురు వ్యక్తుల కోసం గాలిస్తున్నారు.
బెంగళూరు సుల్తాన్‌పాళ్య ప్రాంతంలోని కనకనగర్లో ఉన్న ప్రార్థనా స్థలం సమీపంలో పెద్ద కుట్రకు ప్లాన్ చేసినట్లుగా సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. బెంగళూరు నగరంలో విధ్వంసానికి పాల్పడ్డ వ్యక్తులను గుర్తించడంలో సీసీబీ విజయవంతమైందని కమిషనర్ బీ దయానంద్ తెలిపారు.
పరారీలో ఉన్న నిందితుల్లో ఒకరు కొన్ని విధ్వంసకర కార్యకలాపాలకు పాల్పడ్డాడని, అరెస్టయిన వ్యక్తులకు ఈ ఆయుధాలను అందించినట్లుగా తెలిపారు. నిందితులు బెంగళూరులో వరుస బాంబు పేలుళ్లు జరపాలనుకున్నారని పేర్కొన్నారు.
అయితే, ఉగ్రకుట్రను వెంటనే ఎన్ఐఏకు అప్పగించాలని మాజీ ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై డిమాండ్ చేశారు. బెంగళూరులో వరుస పేలుళ్లకు పాల్పడి నగరంలో పెద్ద ఎత్తున ప్రాణనష్టానికి ప్రణాళిక రూపొందించారని, వీరి వెనుక ఇంకా చాలా మంది ఉండి ఉండవచ్చన్న ఆయన.. కేసును ఎన్ఐఏకు అప్పగించాలని కోరారు.