జ్ఞానవాపి మసీదు కేసులో శుక్రవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. వారణాసిలోని కాశీ విశ్వనాథుని ఆలయం పక్కనే ఉన్న జ్ఞానవాపి మసీదులో శాస్త్రీయ సర్వే నిర్వహించేందుకు వారణాసి జిల్లా కోర్టు అనుమతించింది. జ్ఞానవాపి మసీదులో శాస్త్రీయ సర్వేకు అనుమతించాలంటూ దాఖలైన పిటిషన్పై ఇప్పటికే వాదనలు విన్న కోర్టు శుక్రవారం సర్వేకు అనుమతిస్తూ కీలక తీర్పు చెప్పింది.
అయితే, ఆ జ్ఞానవాపి మసీదులో శివలింగం ఉన్నట్టుగా హిందు ప్రతినిధులు చెబుతున్న ‘వాజూ ఖానా’ మినహా అంతటా సర్వే చేసుకునేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో భారత పురావస్తు పరిశోధనా సంస్థ (ఎ ఎస్ ఐ) జ్ఞానవాపి మసీదులో సర్వే నిర్వహించనుంది.
జ్ఞానవాపి మసీదు అడుగున హిందూ ఆలయం ఉందా? లేదా? అనే విషయాన్ని కనిపెట్టా ఆర్కియాలజీ సర్వే అధికారులను కోర్టు ఆదేశించింది. ఈ సర్వే పూర్తిచేసి ఆగస్టు 4వ తేదీకల్లా నివేదికను సమర్పించాలని న్యాయస్థానం తన ఆదేశాల్లో పేర్కొన్నది.
కాగా, ఈ కేసు విచారణ మరోసారి ఉన్నత న్యాయస్థానాల దాకా వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. కాగా, జ్ఞానవాపి మసీదులో సర్వే నిర్వహణకు అనుమతించాలంటూ హిందువుల తరఫున విష్ణు శంకర్ జైన్ అనే న్యాయవాది పిటిషన్ వేశారు.
ఈ పిటిషన్పై వారణాసి జిల్లా కోర్టు జూలై 14న వాదనలు విన్నది. ఆ తర్వాత అన్ని అంశాలను పరిశీలించి సర్వేకు అనుమతిస్తున్నట్లు ఇవాళ తీర్పు చెప్పింది. వారణాసి కోర్టు తీర్పు విషయాన్ని న్యాయవాది విష్ణు శంకర్ జైన్ మీడియాకు వెల్లడించారు. ఈ తీర్పు కేసులో టర్నింగ్ పాయింట్ అవుతుందని హిందువుల తరపున వాదించిన అడ్వకేట్ సుభాష్ నందన్ చతుర్వేది వ్యాఖ్యానించారు.