వచ్చే ఎన్నికలలో బిజెపి తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కెసిఆర్ అవినీతి పాలనను అంతం చేసే బుల్ డోజర్ ప్రభుత్వం రావాలని ప్రజలందరూ కోరకుంటున్నరని అయన స్పష్టం చేశారు.
తెలంగాణ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ,. ”కేసీఆర్.. రోజులు లెక్కపెట్టుకోండి. మీ కుటుంబాన్ని ఫామ్ హౌస్‌కే పరిమితం చేస్తాం. మీ కుటుంబానికి బానిసలం కాదు” అంటూ హెచ్చరించారు.
“నిజాం భవనాన్ని తలపించేలా ప్రగతి భవన్ కట్టుకున్నారు. పేద ప్రజల ఇళ్ల కోసం మాత్రం స్థలం, నిధులు ఉండవు. బిఆర్ఎస్, బిజెపి ఒక్కటేనని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. 10 ఎకరాలు పార్టీ కార్యాలయం కోసం ఇచ్చిందెవరు? తీసుకున్నది ఎవరు?” అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీని తలదన్నేలా బిఆర్ఎస్ అవినీతి చేసిందని ధ్వజమెత్తుతూ తాము ఏ పార్టీతో కలవం.. కల్వకుంట్ల కుటుంబాన్ని గద్దె దించడమే మా లక్ష్యం అని తేల్చి చెప్పారు. తెలంగాణ ప్రజలు బిజెపి నేతృత్వంలో యుద్ధం చేస్తారని వెల్లడించారు. తెలంగాణలో ఒక అడుగు వెనక్కి వేశామంటే పది అడుగులు ముందుకేస్తాం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి అంటూ హెచ్చరించారు.
జాతీయ రాజకీయాలపై స్పందిస్తూ, వెయ్యి మంది కేసీఆర్‌లు, లక్షమంది ఒవైసీలు, రాహుల్ గాంధీలు వచ్చినా 2024లో నరేంద్రమోదీని అడ్డుకోలేరని తేల్చి చెప్పారు. ప్రతిపక్షాల కూటమిలో ఎవరు ప్రధానమంత్రి అవుతారో తెలియదు. ఆ కూటమి అధికారంలోకి వస్తే 3నెలలకో ప్రధానమంత్రి మారుతారని ఎద్దేవా చేశారు.
ఎవరినీ ఆ కుర్చీలో కూర్చోనివ్వరని అంటూ ఒకరు కాలు పట్టి గుంజితే.. మరొకరు చేయిపట్టి లాగుతారని దుయ్యబట్టారు. దేశ ప్రజలు సమర్థవంతమైన నాయకత్వం కోరుకుంటున్నారని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.
ఆగస్టు ఒకటి నుంచి క్షేత్రస్థాయిలో ఉద్యమాలు
ఇలా ఉండగా, రానున్న శాసనసభ ఎన్నికల్లో బిఆర్ఎస్ పాలనకు చరమగీతం పాడేందుకు కార్యాచరణ చేపట్టాలని బిజెపి కోర్ కమిటీ నిర్ణయించింది. బిజెపి నాయకులు కార్యకర్తలంతా సమిష్టిగా పనిచేయాలని నిర్ణయించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత సాయంత్రం జరిగిన పార్టీ ముఖ్యనాయకుల సమావేశంలో పలు కీలకాంశాలపై చర్చించారు.
రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని.. అందరినీ కలుపుకుని ముందుకెళ్తూ బిజెపిని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేయాలని నిర్ణయించారు. ఆగస్టు ఒకటో తేదీ నుంచి క్షేత్రస్థాయిలో ఉద్యమాలు ఉధృతంగా ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. బిజెపికి మద్దతుగా ప్రజల మద్దతు కూడగట్టేందుకు కార్యక్రమాలకు రూపకల్పన చేయనున్నారు.
ముఖ్యనేతలు ఎవరొచ్చినా దళితవాడల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ బిఆర్ఎస్ సర్కారు వారికి చేసిన మోసాన్ని తెలియజేసేలా చైతన్యం తీసుకురావాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. బిజెపి మాత్రమే తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీని ఓడించగలదనే విశ్వాసం ప్రజల్లో బలంగా ఉందని, దీనిని సద్వినియోగం చేసుకుంటూ అవినీతి, అక్రమ, కుటుంబ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కల్పించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.