దేశవ్యాప్తంగా కరోనా ఉధృతి ఒక్కసారిగా పెరిగిపోయింది. గడచిన 24 గంటల్లో13 వేలకు పైగా కేసులు, 268 మరణాలు నమోదయ్యాయి. దాదాపు రెండు నెలల తర్వాత కేసులు ఈ స్థాయిలో పెరగడం ఇదే మొదటి సారి. మరో వైపు ఒమిక్రాన్ కేసుల సంఖ్య సైతం వెయ్యికి చేరువవుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమయింది.
దేశంలో ఇప్పటి వరకు 1270 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్ వ్యాపిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో ఆంక్షలు అమలు చేస్తున్నారు. తాజాగా దేశంలో తొలి ఒమిక్రాన్ మరణం నమోదైంది. మహారాష్ట్రకు చెందిన ఒమిక్రాన్ బాధితుడు గుండెపోటుతో మృతిచెందాడు. పూణేలోని పింప్రీ చించువాడ మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన 52 ఏళ్ల వ్యక్తి ఒమిక్రాన్‌తో చనిపోయినట్టు మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ధారించింది.
యశ్వంత్ రావు చవాన్ ఆసుపత్రిలో సదరు బాధితుడు కరోనాకు చికిత్స పొందుతూ ఈ నెల 28న మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు. బాధితుడు గుండెపోటుతో చనిపోగా.. అనంతరం చేసిన పరీక్షల్లో అతనికి ఒమిక్రాన్‌గా నిర్ధారణ అయినట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే, అతను ఒమిక్రాన్ కారణంగా చనిపోలేదని, ఇతర అనారోగ్య సమస్యల వల్ల ప్రాణాలు కోల్పోయాడని అధికారులు తెలిపారు. కానీ, ఆరోగ్య నిపుణులు మాత్రం ఆ వ్యక్తికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో కోవిడ్ మరణంగా వర్గీకరించే అవకాశం ఉందని చెబుతున్నారు.
కరోనా తీవ్రత అధికంగా ఉన్న 11 నగరాలను మరోసారి అప్రమత్తమయింది. మరణాలను తగ్గించాలంటే వైరస్ కట్టడికి తక్షణం చర్యలు తీసుకోవాలని ఆయా రాష్ట్రాలకు లేఖలు రాసింది. అంతేకాకుండా ఢిల్లీలో అమలు చేస్తున్న గ్రేడెడ్ రెస్పాన్స్యాక్షన్ ప్లాన్‌ను అమలు చేసే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
గత వారం రోజుల్లో దేశ వ్యాప్తంగా మెట్రో నగరాల్లో కరోనా కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. ముంబయిలో కేవలం ఒక్క రోజులోనే కేసుల సంఖ్య రెట్టింపు అయింది. ఒక్క రోజే 82 శాతం పెరిగి 2,510కి చేరుకున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోను 923 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. అంతకు ముందు రోజుతో పోలిస్తే 86 శాతం పెరిగాయి.
మరో వైపు కొత్త వేరియంట్ కేసులు పెరగడంతో ఇప్పటికే అక్కడ సామాజిక వ్యాప్తి జరిగిందేమోనన్న అనుమానాలను ఢిల్లీ ప్రభుత్వం వ్యక్తం చేసింది. వీటితో పాటుగా గుర్గావ్,చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, అహ్మదాబాద్, ముంబయి సబర్బన్, పుణె, నాగపూర్ నగరాల్లో గత రెండు వారాల్లో కేసులు భారీగా పెరిగాయి.
ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచిస్తూ మహారాష్ట్ర, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, జార్ఖండ్, గుజరాత్, హర్యానా రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం లేఖలు రాసినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
ఇటీవలి కాలంలో దేశీయంగా ప్రయాణాలు, పెళ్లిళ్లు, పండగలు, సెలవులు లాంటి వివిధ కార్యక్రమాలు పెరిగిన దృష్టాను కొన్ని చోట్ల విద్యా సంస్థలకు సెలవులు ముగియడం, లేదా కొనసాగుతున్న దృష్టా అప్రమత్తగా ఉండాలని రాష్ట్రాలకు రాసిన లేఖలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ హెచ్చరించారు.
ఇలా ఉండగా, శీతాకాలం ప్రారంభం కావడంతో కొన్ని రాష్ట్రాల్లో కాలుష్యం పెరిగినందున శ్వాస సంబంధిత సమస్యలు పెరిగే అవకాశం ఉందని, అందువల్ల ఇలాంటి సమస్యలను జాగ్రత్తగా పర్యవేక్షించాలని కూడా ఆ లేఖలో సూచించారు. ఇక అత్యధిక వేగంగా వ్యాపిస్తున్నట్లు భావిస్తున్న ఒమిక్రాన్ కేసుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతున్నాయి.
ఇప్పటికే 22 రాష్ట్రాల్లో ఈ వేరియంట్ విస్తరించింది. చాలా రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రాలు కూడా అప్రమత్తమవుతున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో రాత్రిపూట కర్ఫ్యూ ఆంక్షలు అమలు చేస్తున్నారు. ముఖ్యంగా కొత్త సంవత్సర వేడుకలపైనా ఆంక్షలు విధించేందుకు పలు రాష్ట్రాలు సమాయత్తమవుతున్నాయి.