టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన 500వ అంతర్జాతీయ మ్యాచులో సెంచరీ చేసి మరో రికార్డు సాధించాడు. 181 బంతుల్లో కోహ్లి తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. తన పేవరెట్ షాట్ కవర్ డ్రైవ్‌తో కోహ్లీ ఈ ఘనత సాధించాడు. పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో సెంచరీ చేసిన కోహ్లీ.. 500వ అంతర్జాతీయ మ్యాచ్‌లో శతకం సాధించిన తొలి క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు.
ఈ శతకం తర్వాత విరాట్ కోహ్లీ.. యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ తరహాలో సెలబ్రేషన్స్ చేసుకోవడం విశేషం. ఈ సెంచరీతో కలిపి టెస్టుల్లో ఇప్పటివరకు విరాట్ కోహ్లీ 29 శతకాలు బాదాడు. మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్లో 76వ శతకం నమోదు చేశాడు. కోహ్లీకి వన్డేల్లో 46, టీ-20ల్లో ఒక సెంచరీ ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్లలో టీమిండియా దిగ్గజ క్రికెటర్ వంద సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్నాడు.
తర్వాతి స్థానంలో విరాట్ కోహ్లీ(76) నిలిచాడు. విరాట్ తర్వాత వరుసగా రికీ పాంటింగ్(71), కుమార సంగక్కార(63), జాక్ కల్లిస్(62) సెంచరీలతో ఉన్నారు. అయితే 500 అంతర్జాతీయ మ్యాచులు పూర్తయ్యే సరికి సచిన్ 75 సెంచరీలు నమోదు చేయగా.. విరాట్ కోహ్లీ ఖాతాలో 76 సెంచరీలు ఉన్నాయి. విదేశాల్లో అత్యధిక సెంచరీలు సాధించిన భారత ఆటగాళ్లలో సచిన్(29), తర్వాతి స్థానంలో కోహ్లీ(28) నిలిచాడు. వీదేశీ గడ్డపై ఇంకో సెంచరీ సాధిస్తే సచిన్‌ను సమం చేస్తాడు.
కాగా, 2018 డిసెంబర్ తర్వాత విదేశీ గడ్డపై కోహ్లీకి ఇది తొలి టెస్టు శతకం. వెస్టిండీస్‌తో తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా ఇప్పటి వరకు 4 వికెట్లకు 317 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (182 బంతుల్లో 102 పరుగులు నాటౌట్), రవీంద్ర జడేజా (106 బంతుల్లో 50 పరుగులు నాటౌట్) బ్యాటింగ్ కొనసాగిస్తున్నారు. జడేజా కూడా అర్ధ శకతం పూర్తి చేశాడు. నేడు ఇంకా 82 ఓవర్ల ఆట మిగిలి ఉంది. భారీ స్కోరు దిశగా భారత్ ముందుకు సాగుతోంది.