మతం పేరుతో భారత దేశాన్ని విభజించడానికి కారకుడైన, పాకిస్థాన్ వ్యవస్థాపకుడైన మొహమ్మద్ జిన్నా పేరుతో స్వతంత్ర భారత దేశంలో ప్రముఖ నగరమైన గుంటూరు నడిబొడ్డున ఒక సెంటర్ అనడం, అక్కడ ఆయన విగ్రహం నెలకొనడం తాజాగా వివాదంకు దారితీస్తుంది.
ఈ విషయమై గతంలో సహితం పలు సందర్భాలలో వివాదాలు తలెత్తునా, ఏదో విధంగా సద్దుమణిగిపోయాయి. తాజాగా, బిజెపి జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ఈ అంశాన్ని ప్రస్తావించడంతో బిజెపి నేతలు అందరు పల్లవి అందుకున్నారు. అక్కడ జిన్నా విగ్రహం ఉన్నచోట అబ్దుల్ కలాం విగ్రహం పెట్టాలనే డిమాండ్ చేస్తున్నారు.
గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్‌ను బీజేపీ నేతలు కలిసి జిన్నా టవర్ పేరు మార్చాలంటూ వినతిపత్రం ఇచ్చారు. బీజేపీ నేత సత్యకుమార్ మాట్లాడుతూ మహ్మద్ అలీ జిన్నా భారతదేశ ద్రోహి అని, అటువంటి వ్యక్తి పేరుమీద గుంటూరు వంటి ప్రధాన నగరంలో టవర్ ఉండటానికి వీలులేదని దాని పేరు మార్చి అబ్దుల్ కలాం లేదా గుర్రం జాషువా పేర్లు పెట్టాలని డిమాండ్ చేశారు.
దీంతో రాష్ట్ర బీజేపీ నేతలు ఒక్కసారిగా ప్రకటనలు గుప్పించడం మొదలుపెట్టారు. పేరు మార్చాలని లేదంటే బాబ్రీ మసీదు కూల్చినట్లు కూల్చివేస్తామని హెచ్చరికలు చేశారు. తొలుత బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ట్వీట్టర్ వేదికగా స్పందిస్తూ.. దేశ ద్రోహి ఆలీ జిన్నా పేరు గుంటూరులో టవర్‌కు పెట్టడం ఏంటని ప్రశ్నించారు.
ఎక్కడో పాకిస్తాన్లో ఉండాల్సిన పేరు ఇక్కడ పెట్టడంపై అభ్యంతరం తెలిపారు. ఆ టవర్‌కు అబ్దుల్ కలామ్ లేదా గుర్రం జాషువా పేర్లు పెట్టాలని సత్యకుమార్ డిమాండ్ చేశారు. దేశద్రోహుల పేర్లు ఎక్కడున్నా తొలగించాలని ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు.
రోవైపు హైదరాబాద్‌లోని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ విభజన, అనేక మంది మృతికి కారణమైన జిన్నా పేరును ఇంకా ఎందుకు ఉంచారని ఆయన ప్రశ్నించారు. ఎపి ప్రభుత్వం తక్షణమే ఆ పేరు తీసేయాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. తక్షణం జిన్నా పేరు తీసేసి స్వాతంత్య్ర సమరయోధులు, అబ్దుల్‌కలాం లేదా గుర్రం జాషువా పేరు పెట్టాలని కోరారు.
వాస్తవానికి, జిన్నాటవర్ సెంటర్ పేరు మార్చుతూ 1965-66 మధ్య అప్పటి మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం చేసింది. 1965లో పాకిస్తాన్‌తో యుద్ధం జరుగుతున్న సమయంలో భారతీయ సైనికుడు క్వార్టల్ మార్షల్ హమీద్ ఆ యుద్ధంలో వీరమరణం పొందారు. ఆయన గౌరవార్థం జిన్నాటవర్ పేరును క్వార్టల్ మార్షల్ హమీద్ మందిర్‌గా మార్చుతూ తీర్మానం చేశారు.
అనంతరం తీర్మానాన్ని అమలు చేయలేదు. బీజేపీ నాయకులు ప్రస్తుతం చేస్తున్న డిమాండ్ పాకిస్తాన్‌తో యుద్ధ సమయంలోనే వచ్చింది. అపుడే తీర్మానం చేశారు. కానీ అనంతరం కాంగ్రెస్ నాయకులు పట్టించుకోలేదని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు.
1942లో ఇప్పటి సత్తెనపల్లి మండలం కొమ్మదిపూడిలో కొన్ని మతాల మధ్య గొడవలు జరిగాయి. దాన్ని స్వాతంత్య్ర ఉద్యమ పోరాటంగా మరల్చిన వివాదంలో 14 మంది ముస్లింలకు స్థానిక కోర్టు ఉరిశిక్ష విధించింది.
దీనిని సవాల్ చేస్తూ అప్పటి గుంటూరు ఎమ్మెల్యే లాల్‌జాన్‌బాషా ముంబై కోర్టులో లాయర్‌గా పనిచేస్తున్న ముస్లింలీగ్ అధినేత మహ్మద్ అలీ జిన్నాను కలిసి 14 మంది తరపున వాదించాలని కోరారు. వాదించిన జిన్నా ఉరిశిక్షను రద్దు చేయించారు.
దీనిని గుర్తుంచేందుకు 1942లో అప్పటి స్వాతంత్య్ర ఉద్యమ కారులు మహ్మద్ అలీ జిన్నా పేరు మీద గుంటూరులో టవర్‌ను నిర్మించారు. దీనికి ఆయనను ఆహ్వానించారు. ఆయన వీలు కాకపోవడంతో ఆయన అనుచరుడు జులేదా లియాఖత్ అలీఖాన్ 1945లో దీనిని ప్రారంభించారు. అప్పటి నుంచి దీని నిర్వహణ అంతా గుంటూరు నగరపాలక సంస్థ చూసుకుంటుంది.