మణిపూర్ అంశంపై పార్లమెంట్ లో అధికార, ప్రతిపక్షాల మధ్య ప్రతిష్టంభన నాలుగోరోజున కూడా కొనసాగుతూ ఉండడంతో సభా కార్యక్రమాలకు ఆటంకం కలుగుతుంది. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విరుచుకు పడగా, ఆయన ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు ప్రతిపక్షాలు ఇటీవల ఏర్పాటు చేసిన నూతన కూటమి `ఇండియా’ సమాయత్తం అవుతుంది.
పార్లమెంటు లైబ్రరీ భవనంలో జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ ప్రధాని మోదీ మాట్లాడుతూ.. విపక్షాల ఇండియా కూటమిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. `ఇండియా’ అని పేరు పెట్టుకొన్నంత మాత్రాన ప్రతిపక్షాల తీరు మారుతుందా? అని ప్రశ్నించారు. గతంలో ఈస్ట్ ఇండియా కంపెనీ, ఇండియన్ ముజాహిదీన్ వంటి వాటి పేర్లలో కూడా ఇండియా ఉందని ఎద్దేవా చేశారు.
ఆఖరికి పీఎఫ్ఐ వంటి ఉగ్ర సంస్థల పేరులో కూడా ఇండియా ఉందని చెబుతూ ఇప్పటివరకు ఇలాంటి దిశ, దశ లేని ప్రతిపక్షాన్ని చూడలేదని మండిపడ్డారు. ‘ఒక లక్ష్యమంటూ లేని ముందుకెళ్లే విపక్షాలను నేను ఇంతవరకు చూడలేదు. పేరులో ఇండియా ఉంటే సరిపోదు.. ఈస్ట్ ఇండియా కంపెనీతోపాటు ఇండియన్ ముజాహిదీన్.. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా వంటి వాటి పేర్లలో కూడా ఇండియా ఉంది’ అంటూ ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు చేశారు.
ఇండియా అనే పేరును పెట్టుకున్నంత మాత్రాన ఏమీ ఒరిగిపోదు.. దేశం పేరును ఉపయోగించి ప్రజలను తప్పుదోవ పట్టించలేరని ప్రధాని ధ్వజమెత్తారు. కాగా.. ఈ సమావేశంలో మణిపూర్ హింస నేపథ్యంలో విపక్షాల ఆందోళన, పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహాలపై బీజేపీ పార్లమెంటరీ పార్టీ చర్చించింది.
మణిపూర్ హింసాకాండపై ప్రధాని ప్రకటన చేయాలని గత మూడు రోజుల నుంచి విపక్ష పార్టీలు పార్లమెంట్‌ను స్తంభింపజేయడంతో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. ఓటమి, నిరాశ, నిస్సహాయంతో అలసిపోయిన ప్రతిపక్షాలకు మోదీని వ్యతిరేకించటం ఒకటే ఎజెండా పెట్టుకున్నాయని అభివర్ణించారు. ప్రతిపక్షంగా ఉండేందుకు వారు నిర్ణయించుకున్నారని వారి ప్రవర్తన తెలియజేస్తోందని ప్రధాని మోదీ అన్నారు. 2024 ఎన్నికల్లో ప్రజల మద్దతుతో బీజేపీ సులువుగా మళ్లీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
మణిపూర్ అంశంపై సుధీర్ఘ చర్చ జరపాలని పార్లమెంట్ ఉభయసభల్లోనూ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. గత మూడు రోజుల నుండి ప్రతిపక్షాలు పట్టుబడుతున్నా ప్రధాని మౌనం వీడడం లేదు. దీంతో ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’ లోక్‌సభలో మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే ఛాంబర్ లో సమావేశమైన `ఇండియా’ పక్షాలు ఈ విషయమై సమాలోచనలు జరిపాయి.
‘‘ 83 రోజులుగా ఏమాత్రం తగ్గుదల లేని మణిపూర్ హింసపై ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్లో సమగ్రమైన ప్రకటన చేయాల్సి ఉంది. భయానక హింసకు సంబంధించిన కథనాలు నెమ్మదిగా ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపిస్తున్నాయి. మణిపూర్ హింసపై మోదీ ప్రభుత్వం సమాధానానికి ఇండియా (I.N.D.I.A) డిమాండ్ చేస్తోంది” అంటూ ఖర్గే ట్వీట్ చేశారు.
“ఈశాన్య భరతంలో పరిస్థితులు చాలా సున్నితంగా మారాయి. మణిపూర్ హింసాత్మక పర్యవసనాలు ఇతర రాష్ట్రాలకు కూడా వ్యాపించేలా కనిపిస్తున్నాయి. సరిహద్దులను పంచుకునే సున్నితాత్మాక రాష్ట్రాలకు ఇది ఏమాత్రం మంచిది కాదు. ప్రధాని మోదీ అహాన్ని పక్కనపెట్టి.. దేశానికి మణిపూర్‌పై నమ్మకం కల్పించాలి’’ అని ఖర్గే పేర్కొన్నారు.