చందమామ గుట్టు తెలుసుకునేందుకు భూమి నుంచి బయలుదేరిన చంద్రయాన్-3 స్పేస్‌క్రాఫ్ట్ అంతరిక్షంలో వడివడిగా పరుగులు పెడుతోంది. స్పేస్‌క్రాఫ్ట్‌ను చంద్రుడికి చేరువచేసేందుకు ఇప్పటికే నాలుగుసార్లు విజయవంతంగా కక్ష్య పెంచిన ఇస్రో శాస్త్రవేత్తలు.. మంగళవారం 5వ దశ కక్ష్య పెంపు ప్రక్రియను కూడా విజయవంతంగా పూర్తి చేశారు.
ప్రస్తుతం భూమికి 71351 x 233 కిలోమీటర్ల దూరంలోని కక్ష్యలో తిరుగుతున్న చంద్రయాన్-3 స్పేస్‌క్రాఫ్ట్.. ఇక ఐదో దశ కక్ష్య పెంపు సక్సెస్ కావడంతో భూమికి 1,27,609 x 236 కిలోమీటర్ల దూరంలోగల కక్ష్యలోకి చేరనుందని అంచనా వేస్తున్నారు. బెంగళూరులోని ఇస్రో ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్ (ISTRAC) నుంచి స్పేస్‌క్రాఫ్ట్ కక్ష్య పెంపు ప్రక్రియ చేపట్టారు.
ఇక ఆరోదశ కక్ష్య పెంపు (ట్రాన్స్ లూనార్ ఇంజక్షన్ -TLI)ను ఆగస్టు 1న అర్ధరాత్రి 12 గంటల నుంచి ఒంటిగంట మధ్య చేపట్టాలని ఇస్రో ప్లాన్ చేసింది. కాగా, ఈనెల 14 స్పేస్‌క్రాఫ్ట్ అంతరిక్షంలోకి దూసుకెళ్లిన తర్వాత 15న తొలి దఫా, 16న రెండో దఫా, 18న మూడో దఫా, 20న నాలుగో దఫా, 25న ఐదో దఫా కక్ష్య పెంపు ప్రక్రియలను విజయవంతంగా నిర్వహించారు.
భూమి సుధూర కక్ష్యను చేరుకున్న అనంతరం చంద్రయాన్-3 మిషన్‌ను భూమి-చంద్రుడి ట్రాన్స్ఫర్ కక్ష్యలోకి మల్లించనున్నారు. ఆ తర్వాత స్పేస్‌క్రాఫ్ట్ చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశిస్తుంది. ఆపై ఆగస్టు 23 లేదా 24న చంద్రుడి ఉపరితలంపై దిగుతుంది.