ప్రధాని మోదీ రాజస్తాన్ పర్యటన సందర్భంగా ప్రధాని కార్యాలయం, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ప్రధాని కార్యక్రమంలో తన ప్రసంగాన్ని తొలగించారని, అందువల్ల తాను ఆ కార్యక్రమానికి హాజరు కావడం లేదని బుధవారం ఉదయం గహ్లోత్ ట్వీట్ చేశారు. ఆ ప్రసంగంలో తాను అగ్నివీర్ స్కీమ్ రద్దు, రుణమాఫి డిమాండ్ తదితర అంశాలను లేవనెత్తాలనుకున్నానని వెల్లడించారు.
ప్రధాని మోదీ బుధవారం రాజస్తాన్ లో పర్యటన సందర్భంగా సికర్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రొటోకాల్ ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా పాల్గొనాలి.
అయితే, ఆ కార్యక్రమంలో తన మూడు నిమిషాల ప్రసంగాన్ని తొలగించారని, అందువల్ల ఆ కార్యక్రమానికి హాజరు కావడం లేదని అశోక్ గహ్లోత్ బుధవారం ఉదయం ట్వీట్ చేశారు. ఆ ప్రసంగంలో తాను అగ్నివీర్ స్కీమ్ రద్దు, రుణమాఫి డిమాండ్.. తదితర అంశాలను లేవనెత్తాలనుకున్నానని వెల్లడించారు.
‘నా ప్రసంగాన్ని తొలగించినందువల్ల, నేను స్వయంగా మీకు స్వాగతం పలకలేకపోతున్నా. అందుకే ఈ ట్వీట్ ద్వారా స్వాగతం పలుకుతున్నా’ అని ఆ ట్వీట్ లో పీఎం మోదీ ని ఉద్దేశించి గహ్లోత్ వ్యాఖ్యానించారు. గత ఆరు నెలల్లో ప్రధాని మోదీ ఏడు సార్లు రాజస్తాన్ కు వచ్చిన విషయాన్ని కూడా గహ్లోత్ ప్రస్తావించారు. త్వరలో రాజస్తాన్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
అయితే, రాజస్తాన్ సీఎం అశోక్ గహ్లోత్ ట్వీట్ కు ప్రధాని కార్యాలయం స్పందిస్తూ ప్రధాని మోదీ కార్యక్రమంలో రాజస్తాన్ సీఎం గహ్లోత్ ప్రసంగాన్ని తొలగించలేదని, కాలికి గాయమైనందువల్ల గహ్లోత్ ఆ కార్యక్రమానికి రావడం లేదని తమకు సీఎంఓ నుంచి సమాచారం వచ్చిందని వెల్లడించింది. ప్రధాని మోదీ పాల్గొంటున్న కార్యక్రమ షెడ్యూల్ లో సీఎం గహ్లోత్ ప్రసంగం కూడా ఉందని స్పష్టం చేసింది.
అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన శిలాఫలకాలపై కూడా ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ పేరు ఉందని తెలిపింది. గతంలో రాజస్తాన్ లో ప్రధాని మోదీ పాల్గొన్న అన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో సీఎంగా అశోక్ గహ్లోత్ పాల్గొని, ప్రసంగించిన విషయాన్ని పీఎంఓ గుర్తు చేసింది.
కాగా, కాంగ్రెస్ ప్రభుత్వ చీకటి వ్యవహారాల రికార్డులు రెడ్ డైరీలో ఉన్నాయని అంటున్నారని, దీనిలోని పేజీలను తెరిస్తే, చాలా ముఖ్యమైన సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని చెప్తున్నారని అంటూ అశోక్ గహ్లోత్ ప్రభుత్వంపై ఈ సందర్భంగా జరిగిన బహిరంగసభలో ప్రధాని ధ్వజమెత్తారు. ‘రెడ్ డైరీ’ గురించి ప్రస్తావించడంతో కాంగ్రెస్ పార్టీలోని పెద్ద నేతలు మౌనం దాల్చారని దుయ్యబట్టారు.
దీని గురించి మాట్లాడకుండా పెదవులను కుట్టేసుకున్నా, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్కు గట్టి ఎదురు దెబ్బ తగలబోతోందని చెప్పారు. కాంగ్రెస్ ‘అబద్ధాల దుకాణం’లో ‘రెడ్ డైరీ’ తాజా ప్రాజెక్టు అని ఎండగట్టారు.