దేశవ్యాప్తంగా పెనుసంచలనం సృష్టించిన మణిపూర్ మహిళల నగ్నంగా ఊరేగింపు, అత్యాచారం వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి నిజానిజాలను నిగ్గు తేల్చాలని ఆదేశించింది.
నిందితులకు శిక్ష పడేలా చూడాలని సీబీఐని కోరింది. అంతేకాదు, ఈ కేసుకు సంబంధించిన ముఖ్యమైన విచారణను మణిపూర్ వెలుపల నిర్వహించాలని ఆదేశించింది. మణిపూర్‌లో ఇంకా అల్లర్లు కొనసాగుతున్న నేపథ్యంలో విచారణకు అంతరాయం కలగొచ్చన్న ఉద్దేశంతో కేంద్రం ఈ మేరకు సూచనలు ఇచ్చినట్లు తెలుస్తోంది.
త్వరలోనే ఇందుకు సంబంధించిన అఫిడవిట్ ను సుప్రీంకోర్టులో దాఖలు చేయనున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. కాగా.. మణిపూర్ హింసలో భాగంగా కుకీ తెగకు చెందిన ఇద్దరు మహిళలపై మైతేయీ వర్గంవారు వికృతి చేష్టకు పాల్పడిన తీరుతో భారత్‌తోపాటు ప్రపంచదేశాలు సైతం నివ్వెరపోయాయి.
నగ్నంగా ఊరేగింపు, అత్యాచారం ఘటన దాదాపు మూడు నెలల తర్వాత ఒక వీడియో రూపంలో వెలుగులోకి రావడం, అది కాస్తా వైరల్‌గా మారడం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అప్పుడు గానీ ఈ కేసు ముందుకు కదలలేదు. ఈ దారుణమైన పనికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ సర్వత్రా డిమాండ్ చేస్తున్నారు.
ఈ కేసులో ఇప్పటికే 8 మందిని అరెస్ట్ చేశారు. మరోవంక, ఈ దృశ్యాన్ని చిత్రీకరించిన మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకోవడంతో పాటు, ఆ వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు.
వీడియో వైరల్‌గా మారడంతో దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహజ్వాలలు ఎగిసిపడ్డాయి. ఆ మరుసటి రోజే పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాగా.. ఇప్పటివరకు సభా కార్యకలాపాలేవీ సాగకుండా ఇరు సభల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఈ ఘటనతో అటు మణిపూర్ ప్రభుత్వంతోపాటు కేంద్ర ప్రభుత్వంపైనా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ మోదీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది.