కేంద్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకే మణిపూర్ లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియో విడుదల చేశారని, దీని వెనక కుట్ర ఉందని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ఆరోపించారు. ఈ కుట్రను తేల్చేందుకే దర్యాప్తు కొనసాగుతోందని ఆయన తెలిపారు.
మణిపూర్ ఉద్రిక్తతలను మరింత రెచ్చగొట్టేందుకు 2022లో మయన్మార్లో జరిగిన సంఘటనలకు సంబంధించిన 2 వీడియోలను వైరల్ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. దీనిపై మణిపూర్ పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారని వెల్లడించారు.
ఉద్దేశపూర్వకంగానే మహిళల నగ్న ఊరేగింపు వీడియోను విడుదల చేశారని, దీని వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని స్పష్టం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన కుట్రను తేల్చాల్సి ఉందని పేర్కొన్నారు. మణిపూర్ హింసాత్మక ఘటనలు.. మహిళల నగ్న ఊరేగింపుపై సుప్రీంకోర్టుకు కేంద్ర హోంశాఖ నివేదించిన అఫిడవిట్లోని అంశాలను అమిత్ షా మీడియాకు తెలిపారు
మణిపూర్ అల్లర్లకు సంబంధించిన కేసును కేంద్ర ప్రభుత్వం సీబీఐకి బదిలీ చేసింది. ఇప్పటికే 6 కేసులను ఇప్పటికే సీబీఐకి పంపినట్లు అమిత్ షా వెల్లడించారు. మరో 3 కేసులను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. దర్యాప్తు నిష్పక్షపాతంగా కొనసాగుతోందని హామీ ఇస్తున్నామని చెప్పారు. మణిపూర్ ఘటనపై కేసు విచారణను పొరుగు రాష్ట్రమైన అస్సాంలో విచారణ జరపాలని సుప్రీంకోర్టును కోరుతున్నట్లు తెలిపారు.
మణిపూర్ నగ్న మహిళల ఊరేగింపు సమయంలో అక్కడ పోలీసులు గానీ, ఆర్మీగానీ లేదని పోలీసులు స్పష్టం చేశారు. నిఘా సంస్థలు, హోం శాఖకు గానీ, వీడియోకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు దొరకలేదని చెప్పారు. మరోవైపు నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇప్పటివరకు 6,065 ఎఫ్ఐఆర్లు మణిపూర్లు నమోదు చేశారని తెలిపారు.
మణిపూర్ ఘటనపై కేంద్రం జోక్యం చేసుకున్న తర్వాత మణిపూర్ పరిస్థితి కొంత అదుపులోకి వచ్చిందని పేర్కొన్నారు. జులై 18వ తేదీ నుంచి మణిపూర్లో ఎవరూ చనిపోలేదని అమిత్ షా స్పష్టం చేశారు. 1990 నుంచి మణిపూర్లో కుకీ, మెయితీ తెగల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయని వెల్లడించారు. కేంద్రంలో, మణిపూర్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చాలా ఘటనలు జరిగాయని అమిత్ షా గుర్తు చేశారు.
మే 4 వ తేదీన కుకీ మహిళలపై జరిగిన అత్యంత అమానవీయ ఘటనపై ఇప్పటికే ఓ మైనర్ సహా ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వీడియో తీసిన వ్యక్తిని కూడా అరెస్ట్ చేశామని, వీడియో తీసిన మొబైల్ ఫోన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నామని వివరించారు. మే 3వ తేదీ నుంచి జరుగుతున్న ఘర్షణల్లో ఇప్పటివరకు 147 మంది చనిపోగా, 40 వేల మందిని ప్రభుత్వ సహాయక శిబిరాలకు తరలించినట్లు చెప్పారు.
ప్రస్తుతం మణిపూర్లో పరిస్థితులు అదుపులోనే ఉన్నాయన, 72 శాతం ప్రభుత్వ ఉద్యోగులు తిరిగి విధుల్లోకి చేరినట్లు తెలిపారు. 82 శాతం మంది విద్యార్థులు పాఠశాలలకు చేరుకున్నట్లు వెల్లడించారు. త్వరలోనే మణిపూర్లో శాంతి భద్రతలు సాధారణ స్థితికి వస్తాయని అమిత్ షా తెలిపారు.