హింసాకాండతో దెబ్బతిన్న మణిపూర్‌లోని పరిస్థితిని ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు ఇండియా కూటమి ఎంపిల బృందం శని, ఆదివారాల్లో ఆ రాష్ట్రంలో పర్యటిస్తుంది. ఈ బృందంలో16 పార్టీలకు చెందిన 20 మంది ఎంపిలు ఉన్నారు.
ఎంపిలు అధిర్ రంజన్ చౌదరి, గౌరవ్ గొగోరు, ఫూలో దేవి నేతమ్ (కాంగ్రెస్), లాలన్ సింగ్, అనిల్ ప్రసాద్ హెగ్డే (జెడియు), సుస్మితా దేవ్ (టిఎంసి), కనిమొళి (డిఎంకె), ఎఎ రహీం (సిపిఎం), సంతోష్ కుమార్ (సిపిఐ), మనోజ్ కుమార్ ఝా (ఆర్జెడి), జావేద్ అలీ ఖాన్ (ఎస్పి), పి.పి మహ్మద్ ఫైజల్ (ఎన్‌సిపి), ఈ.టి మహ్మద్ బషీర్ (ఎన్‌సిపి), ఎన్‌కె ప్రేమ్ చంద్రన్ (ఆర్ఎస్పి), సుశీల్ గుప్తా (ఆప్), అరవింద్ సావంత్ (శివసేన (ఉద్ధవ్ ఠాక్రే)), రవి కుమార్, తిరుమావళవన్ (విసికె), జయంత్ చౌదరి (ఆర్ఎల్డి), మహువా మజీ (జెఎంఎం) ఈ బృందంలో ఉన్నారు.
రెండు రోజుల పాటు ఈ ఎంపిలు సహాయక శిబిరాలు, హింసాత్మక ప్రాంతాలకు వెళ్లి బాధితులతో పాటు వివిధ గ్రూపులకు ప్రజలను కలుసుకుంటారు. లోయ, పర్వత రెండు ప్రాంతాల్లో బృందం పర్యటించనుంది. ఇప్పటికే మణిపూర్‌ను కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ నేతృత్వంలో ఎంపిలు హైబీ ఈడెన్, డిన్ కురియాకోస్, సిపిఎం, సిపిఐ ఎంపిలు జాన్ బ్రిట్టాస్, బికాష్ రంజన్ భట్టాచార్య, బినరు విశ్వం, సంతోష్ కుమార్, సుబ్బరామన్ .బృందం, కేరళ కాంగ్రెస్ ఎంపి జోషి కె. మణి నేతృత్వంలో ఆ రాష్ట్ర కాంగ్రెస్ బృందంతో పాటు వివిధ ప్రజా సంఘాలు సందర్శించాయి.
25, 26 తేదీల్లో బొంబాయిలో భేటీ
ప్రతిపక్షాల కూటమి ఇండియా తదుపరి సమావేశం ముంబయిలో జరగనుంది. ఆగస్టు 25, 26 తేదీల్లో రెండు రోజుల పాటు ఈ సమావేశం నిర్వహించనున్నారు. తొలి సమావేశం పాట్నాలో, రెండో సమావేశం బెంగళూరులో జరిగింది. కాంగ్రెస్ ఆతిథ్యంలో ఈ నెల 17, 18 తేదీల్లో జరిగిన బెంగళూరు సమావేశంలోనే కూటమి పేరును ఖరారు చేసిన సంగతి తెలిసిందే.
ఈ సమావేశానికి 26 ప్రతిపక్ష పార్టీలు హాజరయ్యాయి. అంతకు ముందు జూన్ 23న పాట్నాలో నితీష్ కుమార్ ఆతిథ్యం ఇచ్చిన ప్రతిపక్షాల సమావేశానికి 15 పార్టీలు హాజరయ్యాయి. ముంబయిలో జరుగనున్న ఇండియా కూటమి సమావేశానికి శివసేన నేత ఉద్ధవ్ ఠాక్రే, ఎన్‌సిపి చీఫ్ శరద్ పవార్ ఆతిథ్యం ఇవ్వనున్నారు.
ఈ సమావేశంలో కో-ఆర్డినేషన్ కమిటీ, జాయింట్ సెక్రటేరియట్, ఇతర ప్యానల్స్‌ను ఖరారు చేసే అవకాశం ఉంది. కనీస ఉమ్మడి కార్యక్రమంపై కసరత్తు చేయడం, 2024 లోక్‌సభ ఎన్నికల్లో బిజెపిని ఎదుర్కొనేందుకు సంయుక్త ఆందోళనా కార్యక్రమాలను ఖరారు చేయడం వంటివి సమావేశాల ప్రధాన ఎజెండాగా ఉన్నాయి.
ముంబయి సమావేశంలో 11 మంది సభ్యులతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే తెలిపారు. ప్రచార నిర్వహణ, సంయుక్తంగా ర్యాలీలు నిర్వహించడం వంటి కార్యక్రమాల కోసం సెంట్రల్ సెక్రటేరియట్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు. సమన్వయ కమిటీల్లో అన్ని పార్టీలకు ప్రాతినిధ్యం ఉంటుందన్నారు. అలాగే కూటమి కన్వీనర్‌ను కూడా ముంబయి సమావేశంలో ఎన్నుకుంటారు.
