పార్లమెంట్ తిరిగి సోమవారం సమావేశమైనప్పుడు సహితం మణిపూర్ అంశంలో గందరగోళం చెలరేగి తిరిగి పార్లమెంట్ వాయిదాకు దారితీసింది. లోక్‌సభ, రాజ్యసభలలో విపక్షాలు మణిపూర్‌పై చర్చకు, స్వయంగా ప్రధాని నుంచి ప్రకటనకు పట్టుపట్టాయి. ఈ క్రమంలో తొలుత ఓసారి ఆ తరువాత మధ్యాహ్నం వాయిదా పడి, మరుసటిరోజుకు పార్లమెంట్ వాయిదాల పర్వం తిరిగి కొనసాగింది.
ఈ విధంగా పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో మరో వారం ఆరంభం వాయిదాల అర్పణం అయింది. అజెండాను పక్కకు పెట్టి మణిపూర్‌పై చర్చించాలని రాజ్యసభలో రూల్ 267తో రాజ్యసభలో విపక్షం పట్టు పట్టింది. ఉదయం తొలుత మణిపూర్ అంశంపై నాలుగుసార్లు సభ వాయిదా పడింది.
తర్వాత మధ్యాహ్నం 3.30 గంటలకు సభ ప్రారంభం కాగానే ఇదే పరిస్థితి నెలకొంది. సభాకార్యకలాపాల్లోని ఇతర అంశాలను పక్కకు పెట్టి, రూల్ 267 కిందచర్చించాలని వెల్‌లోకి దూసుకువచ్చి విపక్షాలు డిమాండ్ చేశాయి. చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ముందు విపక్షాలు నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాల్సి ఉందని సభాధ్యక్షులు జగదీప్ ధన్కర్ కోరారు.
సభ్యులు వెంటనే తమతమ స్థానాలకు వెళ్లాలని సూచించారు. అయినప్పటికీ వారు వినకపోవడంతో వారిపై ధన్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విధంగా చేయడం దేశానికి మంచిది కాదని, సముచిత ఉదాహరణ అన్పించుకోదని స్పష్టం చేశారు. ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉందని , ఈ విధంగా సభ్యులు వ్యవహరించడం దురదృష్టకరం పేర్కొన్నారు.
పార్లమెంట్ వర్షాకాల భేటీ ఆరంభం అయిన నాటి నుంచి ఇదే తంతు అయిందని, సభా సమయాన్ని సరిగ్గా వాడుకోడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి ప్రజలు మూల్యం చెల్లించుకోవల్సి వస్తుందని వారించారు. మనను మనం కించపర్చుకుంటున్నామని, దేశానికి ప్రపంచానికి ప్రమాదకరమైన సంకేతాలు పంపిస్తున్నామని హెచ్చరించారు, అయితే సభలో రణగొణధ్వనులు సాగడంతో సభాధ్యక్షులు సభను మంగళవారానికి వాయిదావేశారు.
ఇక దిగువ సభ లోక్‌సభలో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. మధ్యాహ్నం రెండు గంటలకు తిరిగి సభ ఆరంభం కాగానే ప్రతిపక్షాలు మణిపూర్ అంశాన్ని ప్రస్తావించాయి. ప్రధాని మోదీ మణిపూర్‌పై ప్రకటన వెలువరించాలని పట్టుపట్టాయి. చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, సంబంధిత విషయంపై హోం మంత్రి ఇంతకు ముందే వివరణ ఇచ్చారని కేంద్రం తరఫున తెలిపారు.
అయితే ప్రధాని నుంచి ప్రకటన అత్యవసరం అని ప్రతిపక్షాలు స్పష్టం చేస్తూ ఉండటంతో సభను స్పీకర్ మరుసటి రోజుకు వాయిదా వేశారు. మధ్యాహ్నం సభలో ప్రతిపక్షాల నినాదాల నడుమనే సమాచార ప్రసార మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రవేశపెట్టిన సినిమాటోగ్రాఫ్ సవరణ బిల్లు 2023ను సభ ఆమోదించింది. ఇప్పటికే రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందింది.