గతేడాది జూన్ నెల జీఎస్టీ వసూళ్ళతో పోల్చుకుంటే 2023 జూన్ నెలలో జీఎస్టీ వసూళ్ళు 12 శాతం పెరిగినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి వెల్లడించారు. రాజ్యసభలో మంగళవారం విజయసాయి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా బదులిచ్చారు.
జీఎస్టీ కింద 2023 జూన్ నెలలో రూ.161,497 కోట్లు వసూలైనట్లు మంత్రి తెలిపారు. ఒక్క నెలలో జీఎస్టీ మొత్తం వసూలు రూ.1.6 కోట్లు అదిగమించడం జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఇది నాలుగోసారని తెలిపారు. జీఎస్టీ వసూళ్లలో ప్రతి సంవత్సరం సాధిస్తున్న వృద్ధితో అనుకూల ధోరణి కనిపిస్తోందని పేర్కొన్నారు.
పార్లమెంటులో చేసిన చట్టానికి లోబడి జీఎస్టీ యాక్ట్ ప్రకారం జీఎస్టీ అమలు చేయడం ద్వారా మొదటి 5 సంవత్సరాలు 2017 జూన్ 1 నుండి 2022 జూన్ 30 వరకు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు ఏర్పడ్డ రెవెన్యూ నష్టాలను పూడ్చేందుకు కేంద్రం నష్టపరిహారం చెల్లించిందని తెలిపారు. ఈ చట్టం ప్రకారం రాష్ట్రాలకు ఇవ్వాల్సిన నష్టపరిహారం ప్రతి రెండు నెలలకోసారి లెక్కించి విడుదల చేయాలని వివరించారు.