బీహార్ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వేను సవాలు చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లను పాట్నా హైకోర్టు మంగళవారం కొట్టేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ సర్వేను తిరిగి ప్రారంభించేందుకు మార్గం సుగమమైంది. ఈ ఏడాది జనవరిలో బీహార్ ప్రభుత్వం కులగణనను మొదలు పెట్టింది. మొదటి దశ సర్వే జనవరి 7- 21 తేదీల మద్య ముగిసింది.
రెండో సర్వే ఏప్రిల్ 15న మొదలై మే 15తో ముగియాల్సి ఉండగా, మే 4న పాట్నా హైకోర్టు సర్వేపై స్టే విధించింది. మంగళవారం కులగణనకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కె. వినోద్ చంద్రన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపి, వాటిని కొట్టేసింది.
దీంతో కుల ప్రాతిపదికన సర్వేను రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరించవచ్చు. వివిధ అంశాలను ప్రస్తావిస్తూ ఈ సర్వేను నిరోధించాలని పిటిషనర్లు కోరారు. వీటిని డిస్మిస్ చేస్తున్నట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కే వినోద్ చంద్రన్, జస్టిస్ పార్థసారథి ధర్మాసనం తెలిపింది. జూలై 7న రిజర్వు చేసిన తీర్పును మంగళవారం వెల్లడించింది.
బిహార్ ప్రభుత్వం వాదనలు వినిపిస్తూ, 80 శాతం సర్వే పూర్తయిందని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. కుటుంబాల గణన జనవరి 7న ప్రారంభమై, జనవరి 21న ముగిసిందని తెలిపింది. రెండో దశ సర్వే ఏప్రిల్ 15న ప్రారంభమైందని తెలిపింది. ప్రజల కులం, వారి సాంఘిక-ఆర్థిక పరిస్థితులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించినట్లు తెలిపింది. ఈ మొత్తం ప్రక్రియ 2023 మే నెలలో పూర్తికావలసి ఉందని పేర్కొంది.
Pఅయితే పాట్నా హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేస్తామని పిటిషనర్ల తరఫు న్యాయవాది దిను కుమార్ తెలిపారు. రాష్ట్రంలోని వివిధ కులాల వారి అభ్యున్నతికి పాటుపడేందుకు వీలుగా వారి సామాజిక ఆర్థిక స్థితి గతుల గురించి సమాచారం తెలుసుకునేందుకు బీహార్లో కులగణన చేపట్టనున్నట్టు గత ఏడాది సీఎం నితీశ్ కుమార్ ప్రకటించారు. రాష్ట్రంలోని 38 జిల్లాల్లో రెండు దశల్లో ఈ ప్రక్రియ పూర్తిచేస్తామని అప్పట్లో ప్రకటించారు.