జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని భావిస్తున్న బిఆర్ఎస్ కు ఇండియా, ఎన్డీయే కూటముల్లో ఉండాల్సిన అవసరం లేదని ఆ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. బిఆర్ఎస్ ఒంటరిగా లేమని, తమతో కలిసి నడిచే మిత్రులున్నారని మహారాష్ట్ర పర్యటనలో వెల్లడించారు.
మహారాష్ట్రలోని సాంగ్లి జిల్లా వాటేగాఁవ్ గ్రామంలోని ఇండియన్ మాక్సింగోర్కిగా పేరొందిన అన్నా భావ్సాఠే జయంతి వేడుకల్లో పాల్గొన్న ఆయన దేశంలో 50 ఏళ్లకు పైగా అధికారంలో ఉన్న ఆ కూటములలో వారేనని, అయినా మార్పు రాలేదని గుర్తుచేశారు. దేశంలో నూతన మార్పు జరగాల్సిందేనని వాటేగామ్‌లో నిర్వహించిన బహిరంగ సభలో చెప్పారు.
‘మహారాష్ట్రలో సంపదకు కొదవ లేదు. అద్భుతమైన వనరులున్నాయని, ఉపాధి అవకాశాలు అపారమని అయినా ఏ పట్టణానికి వెళ్లినా తాగునీటి కొరత వేధిస్తోంది. దళిత సమాజం ఇప్పటికీ వెనుకబడే ఉంది’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికాలో వివక్షను విడిచిపెట్టి, నల్లజాతీయుడు బరాక్ ఒబామాను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారని వివక్ష పాపాలను కడిగేసుకున్నారని కేసీఆర్ గుర్తు చేశారు.
ఒబామా అధికారం చేపట్టాక నల్లజాతీయుల జీవితాల్లో మార్పు వచ్చిందని చెబుతూ భారత్‌లోనూ ఆ దిశగా పరివర్తన జరగాలని కేసీఆర్ పిలుపిచ్చారు. మాతంగి సమాజానికి బిఆర్ఎస్ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
మహారాష్ట్రలో ఇప్పటికే ఎన్నికల సమర శంఖం పూరించామని, అన్ని గ్రామాల్లోనూ తొమ్మిది కమిటీలను నియమిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే 50% గ్రామాల్లో కమిటీల ఏర్పాటు పూర్తయిందని, మరో 15-20 రోజుల్లో మిగిలినవి పూర్తి చేస్తామన్నారు. క్రమేణా రాష్ట్రస్థాయి వరకు కమిటీలను వేసుకుంటామని కేసీఆర్ వెల్లడించారు.
మహారాష్ట్రలోని వాటేగావ్‌లో అన్నాభావూ సాఠే 103వ జయంతి సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ప్రముఖ మాతంగి దళిత కవి, దేశం గర్వించదగ్గ ప్రజాకవి, అన్నాభావూ సాఠే అని కొనియాడారు. అంటరాని కులంలో పుట్టి జీవితాన్ని సాహిత్యంతో వడబోసిన దళిత బిడ్డ అని పేర్కొన్నారు. అన్నాభావూ సాఠేను భారతరత్నగా గుర్తించాలని కోరారు.