ఢిల్లీ గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ (సవరణ) బిల్లు లోక్సభలో గురువారం ఆమోదం పొందింది. ఈ బిల్లును కేంద్ర హోం శాఖ మంత్రి మంత్రి అమిత్ షా ప్రవేశపెట్టారు. అనంతరం చర్చ జరిగింది. ఈ బిల్లును ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి.
బిజెపితో పాటు పివి మిథున్ రెడ్డి (వైసిపి), పినాకి మిశ్రా (బిజెడి), రాహుల్ రమేష్ షెవాలే (శివసేన (షిండే) ) బిల్లుకు మద్దతు ఇవ్వగా, టిడిపి హాజరుకాలేదు. బిల్లును కాంగ్రెస్, డిఎంకె, టిఎంసి, సిపిఎం, జెడియు, ఎన్సిపి, ఎస్పి, సిపిఐ, ఐయుఎంఎల్, నేషనల్ కాన్ఫరెన్స్, శివసేన (ఠాక్రే), ఆర్ఎస్పి, ఆప్ తదితర ఇండియా కూటమి పార్టీలతో పాటు బిఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు వ్యతిరేకించాయి.
డిఎంకె తరపున దయానిధి మారన్ మాట్లాడుతున్నప్పుడు స్పీకర్ స్థానంలో ప్యానెల్ స్పీకర్ రాజేంద్ర అగర్వాల్ మరో సభ్యుడిని మాట్లాడేందుకు పిలవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన డిఎంకె సభ్యులు వాకౌట్ చేశారు.
ఆప్ ఎంపీ సుశీల్ కుమార్ రింకు ప్రతులను చింపి స్పీకర్ చైర్ వైపు విసిరారు. దీంతో ఆయన్ను సభ నుంచి సస్పెండ్ చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో బీఆర్ఎస్ సహా విపక్ష సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.
బిల్లుపై ఎన్సిపి ఎంపి సుప్రియా సులే మాట్లాడుతూ ఈ బిల్లు ఎన్నిక వర్సెస్ ఎంపికలా ఉందని విమర్శించారు. ఎన్నికైన ప్రభుత్వాన్ని ఎంపికైన వ్యక్తులు ఎలా నడుపుతారని ప్రశ్నించారు. వినాయక్ రౌత్ (శివసేన ఠాక్రే) మాట్లాడుతూ ఈ బిల్లు ప్రజస్వామ్యాన్ని ఖూనీ చేయడమే కాకుండా, మొత్తం ఢిల్లీ ప్రజలను అవమానించడమేనని మండిపడ్డారు.
సభ్యులు మాట్లాడిన తరువాత అమిత్ షా సమాధానం స్య్ కేంద్ర పాలిత ప్రాంతాలు, ఢిల్లీలో చట్టాలు రూపొందించే అధికారం కేంద్రానికి ఉందని స్పష్టం చేశారు. గతంలో బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఢిల్లీని పాలించినప్పుడు ఈ సమస్య తలెత్తలేదని పేర్కొన్నారు.
‘‘ఢిల్లీ రాష్ట్రం కాదు. కేంద్ర పాలిత ప్రాంతం. ఢిల్లీ సేవలు ఎప్పటికీ కేంద్రంతోనే ముడిపడి ఉంటాయి. దేశ రాజధాని ఢిల్లీకి సంబంధించిన ఏదైనా సమస్యపై చట్టాలు చేసే హక్కు కేంద్రానికి ఉందని సుప్రీంకోర్టు ఆదేశాలు చెబుతున్నాయి. రాజధానిలో బ్యూరోక్రాట్లను ఎవరు నియంత్రిస్తారనే దానిపై సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారమే బిల్లును తీసుకొచ్చాం. ఢిల్లీ కోసం చట్టాలు చేసేందుకు కేంద్రాన్ని అనుమతించే నిబంధనలు/అధికరణలు రాజ్యాంగంలో కూడా ఉన్నాయి’’ అని ఆయన గుర్తుచేశారు.
