కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. మోదీ ఇంటి పేరుపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పరువునష్టం కేసులో గుజరాత్‌లోని సూరత్ కోర్టు విధించిన జైలు శిక్షపై స్టే విధించింది. ఎంపీ హోదాను కూడా పునరుద్ధరించింది.
అలాగే వచ్చే ఏడాది జరుగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ పోటీ చేసేందుకు కూడా సుప్రీంకోర్టు వీలు కల్పించింది. శిక్షపై స్టే కోరుతూ రాహుల్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తులు బీఆర్ గవాయ్, పీఎస్ నరసింహ, సంజయ్ కుమార్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది.
రాహుల్‌ను దోషిగా నిర్ధారించడం విస్తృతమైందని, ఇది ఒక వ్యక్తిపైనే కాకుండా ఎన్నుకున్న ఓటర్ల హక్కుపై కూడా ప్రభావం చూపుతుందని జస్టిస్ బీఆర్ గవాయ్ పేర్కొన్నారు. ట్రయిల్ కోర్టు గరిష్ఠ శిక్షను విధించడంపైనా ధర్మాసనం సంశయం వ్యక్తం చేసింది. అలాగే మాట్లాడేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలని రాహుల్ గాంధీకి కూడా చురకలు వేసింది. ఆయనకు విధించిన జైలు శిక్షపై స్టే విధించడంతోపాటు ఎంపీ అనర్హతను ఎత్తివేసింది.
కాగా, 2019 ఏప్రిల్ 13న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ‘దొంగలందరికీ మోదీ అనే సాధారణ ఇంటి పేరు ఎలా వచ్చింది?’ అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. గుజరాత్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీ దీనిపై సూరత్ కోర్టును ఆశ్రయించారు. రాహుల్ గాంధీపై క్రిమినల్ పరువు నష్టం దావా వేశారు.
విచారణ జరిపిన సూరత్ కోర్టు ఈ ఏడాది మార్చి 23న రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారించి రెండేళ్లు జైలు శిక్ష విధించింది. ఈ నేపథ్యంలో లోక్‌సభ స్పీకర్ ఆ మరునాడు ఆయనపై అనర్హత వేటు వేశారు. మరోవైపు జైలు శిక్షపై స్టే కోసం రాహుల్ గాంధీ ట్రయల్ కోర్టుతోపాటు గుజరాత్ హైకోర్టుకు వెళ్లారు.
ఫలితం లేకపోవడంతో చివరకు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన త్రిసభ్య ధర్మాసనం ఊరట ఇచ్చింది. రాహుల్ గాంధీకి విధించిన జైలు శిక్షపై స్టే విధించడంతోపాటు ఎంపీ హోదాను పునరుద్ధరించింది. ఈ మేరకు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.