ప్రమాద బీమాపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. బైక్ వెనుక సీటుపై కూర్చున్న వ్యక్తికి కూడా ప్రమాద బీమా వర్తిస్తుందని హైకోర్టు వెల్లడించింది. 2004లో అనంతపురం జిల్లాలో జరిగిన బైక్ యాక్సిడెంట్ కేసులో హైకోర్టు ఈ విధంగా తీర్పు ఇచ్చింది. బాధితులు అప్పీల్ చేయకపోయినప్పటికీ పరిహారం పెంచే అధికారం హైకోర్టుకు ఉందని తేల్చిచెప్పింది.
నవంబర్ 2004లో అనంతపురం జిల్లాకు చెందిన శివశంకర్, శివకేశవులు ఒక బైక్‌పై, సాకే ముత్యాలు, దాసరి బోడప్ప మరొక ద్విచక్ర వాహనంపై అనంతపురం వెళ్తున్నారు. సాకే ముత్యాలు ముందు వెళుతున్న వాహనాన్ని ఢీకొట్టడంతో నలుగురు కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో బైక్ వెనుక కూర్చొన్న బోడప్ప తీవ్రంగా గాయపడి మృతి చెందారు.
ప్రమాద బీమా కోసం మృతుడి కుటుంబ సభ్యులు బీమా కంపెనీకి అప్లై చేసుకున్నారు. కానీ బీమా డబ్బులు ఇచ్చేందుకు యునైటెడ్ ఇండియా ఎష్యూరెన్స్ కంపెనీ నిరాకరించింది. దీంతో బాధితులు మోటారు అనంతపురం ఐదో అదనపు జిల్లా కోర్టు, ప్రమాద బీమా క్లైమ్ల ట్రైబ్యునల్ ను ఆశ్రయించారు. కోర్టు బాధితులకు అనుకూలంగా తీర్పు చెప్పింది.
ఇన్సూరెన్స్ కంపెనీ బాధితులకు రూ.2 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఈ తీర్పును యునైటెడ్ ఇండియా ఎష్యూరెన్స్ కంపెనీ హైకోర్టులో సవాల్ చేసింది. బైక్ యజమాని అదనపు ప్రీమియం చెల్లించలేదని, వెనుక సీటులో కూర్చొన్న వ్యక్తికి ప్రమాద బీమా వర్తించదని ఇన్సూరెన్స్ కంపెనీ తరఫున న్యాయవాది వాదించారు.
ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ప్రమాద బీమా బైక్ వెనుక సీటుపై కూర్చొన్న వ్యక్తికి కూడా వర్తిస్తుందని ప్రకటించింది. రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్న పైలాన్ రైడర్లు ‘థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్’ కింద బీమా పరిహారం పొందేందుకు అర్హులని గతంలో కోల్ కతా హైకోర్టు ఒక చారిత్రక తీర్పు ఇచ్చింది.
బైక్ వెనుక సీట్లో కూర్చొని ఉన్న వ్యక్తి ప్రమాదంలో మరణిస్తే ‘థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్’ పొందేందుకు అర్హత లేదని బీమా సంస్థ పేర్కొన్న కేసులో కోల్ కతా హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ తీర్పునిచ్చింది. పైలాన్ రైడర్‌కు బీమా పరిహారం అర్హతపై బీమా సంస్థ, బాధితులకు మధ్య జరిగిన కేసును హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు ఇస్తూ.. పైలాన్ రైడర్ కూడా బీమా వర్తిస్తుందని పేర్కొంది.