మణిపూర్ ఘటనపై విచారణకు ముగ్గురు మహిళా న్యాయమూర్తులతో కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు సుప్రీంకోర్టు సోమవారం ప్రకటించింది. జస్టిస్ గీతా మిట్టల్, జస్టిస్ షాలినీ పన్సాల్కర్ జోషి, జస్టిస్ ఆషా మీనన్‌లతో కూడిన కమిటీని నియమిస్తున్నట్లు వెల్లడించింది. ఈ కమిటీ పునరావాసం, పరిహారంపై అధ్యయనం చేయనుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.వై. చంద్రచూడ్ ఆదేశించారు.
జస్టిస్ గీతా మిట్టల్ జమ్ము కాశ్మీర్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి. జస్టిస్ జోషి బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి. జస్టిస్ మీనన్ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా విధులు నిర్వహించి రిటైరయ్యారు. అలాగే సీబీఐ దర్యాప్తును పర్యవేక్షించేందుకు ఓ అధికారిని నియమిస్తున్నట్లు అత్యున్నత న్యాయస్థానం తెలిపింది.
చట్టపాలనపై విశ్వసనీయతను పునరుద్ధరించేందుకే ఈ కమిటీని ఏర్పాటుచేస్తున్నామని సీజేఐ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం తెలిపింది. . విచారణ నివేదికను ఆ అధికారి కోర్టుకు సమర్పించాలని సూచించింది మహారాష్ట్ర మాజీ డిజిపి, ముంబయి పోలీస్ కమిషనర్ అయిన దత్తార్రు పద్సల్గికర్ను పర్యవేక్షక అధికారిగా నియమిస్తున్నట్లు వెల్లడించింది.
వివిధ రాష్ట్రాలకు చెందిన కనీసం ఐదుగురు డిప్యూటీ సూపరింటెడెంట్ స్థాయి అధికారులు సీబీఐలో ఉంటారని పేర్కొంది. సీబీఐకి బదలీ చేయని కేసుల వ్యవహారం 42 సిట్లు చూసుకుంటాయని, మణిపూర్‌కు సంబంధం లేని డీఐజీ ర్యాంకు అధికారులు ఈ సిట్లను పర్యవేక్షిస్తారని, ఒక్కో ఆఫీసర్ ఆరు సిట్లను పర్యవేక్షిస్తారని, విచారణ సజావుగా సాగేందుకు ఈ చర్యలు ఉపకరిస్తాయని ధర్మాసనం స్పష్టం చేసింది.
మణిపూర్ హింసపై దాఖలైన పిటిషన్లపై గత విచారణలో సుప్రీం విచారణ సందర్భంగా ఇచ్చిన ఆదేశాల మేరకు ఆ రాష్ట్ర డీజీపీ రాజీవ్ సింగ్ సోమవారంనాడు ధర్మాసనం ముందు హాజరయ్యారు. మణిపూర్ హింస, నివారణకు తీసుకున్న చర్యలపై సుప్రీంకోర్టుకు ఆయన వివరించారు.
హింసాత్మక ఘటనలపై జిల్లా ఎస్పీల నేతృత్వంలో సిట్ల ఏర్పాటుకు సిద్ధమని రాజీవ్ సింగ్ కోర్టు దృష్టికి తెచ్చారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తరఫున అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ధర్మసానం ముందు హాజరయ్యారు. గత విచారణలో సుప్రీంకోర్టు ఆదేశించిన నివేదికలను సమర్పించారు.