ప్రజలను మాఫియా కోరల నుంచి కాపాడటానికే తాను రాజకీయాల్లోకి వచ్చానని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. ప్రముఖ ఆంగ్ల పత్రిక టైమ్స్ అఫ్ ఇండియా నిర్వహించిన `ఉత్తర ప్రదేశ్ గమ్యం’ సదస్సులో మాట్లాడుతూ, తాను సామాన్యులు ఎదుర్కొంటున్న కష్టాలను చూశానని, ఆ పరిస్థితులే తనను రాజకీయాల్లో చేరేందుకు ప్రేరేపించాయని తెలిపారు.
1994లో గోరక్షక్ పీఠ్ అధిపతిగా నియమితుడైన తనను ఆ ప్రాంతంలో జరిగిన రెండు సంఘటనలు కదిలించినట్లు వెల్లడించారు. ఆ సమయంలో యుపిలో సమాజావాది పార్టీ అధికారంలో ఉన్నదని చెబుతూ, గోరఖ్‌పూర్‌లో ఓ ప్రముఖ కుటుంబం ఉండేదని, వారికి రెండు పెద్ద భవనాలు ఉండేవని చెప్పారు. ఈ భవనాలను రాష్ట్ర ప్రభుత్వం మాఫియాకు కేటాయించిందని, ఆందోళనకు గురైన ఆ కుటుంబం ఆ భవనాలను కూల్చేసిందని చెప్పారు.
వాటిని కూల్చేసిన మర్నాడు తాను ఆ కుటుంబాన్ని కలిసి, ఏం జరిగిందని, భవనాలను ఎందుకు కూల్చేశారని అడిగానని పేర్కొన్నారు. అందుకు ఆ కుటుంబ సభ్యులు బదులిస్తూ, ఈ భవనాలను తాము కూల్చకపోతే, తాము సర్వం కోల్పోయి ఉండేవారమని చెప్పారని తెలిపారు. భవనాలను కూల్చడం వల్ల కనీసం తమకు భూమి అయినా మిగిలిందని చెప్పారని వివరించారు.
తిరిగి, 2006లో మళ్ళి ఎస్పీ హయాంలోనే తనకు గోరఖ్‌పూర్‌లోని ఓ సంపన్నుడు ఫోన్ చేసి తన ఇంటిని ఓ మంత్రి ఆక్రమించినట్లు చెప్పారని తెలిపారు. వెంటనే తాను ఆ ఇంటికి వెళ్ళానని, అప్పటికి కొందరు వ్యక్తులు ఆ ఇంటి నుంచి సామాన్లను బయట విసిరేయడం చూశానని తెలిపారు. చుట్టుపక్కల ప్రజలు ఆ సంఘటను చూస్తున్నారని, ఏమీ చేయలేదని తెలిపారు.
ఇంటి యజమాని దానిని అమ్మలేదని, అటువంటపుడు దానిని ఏ విధంగా స్వాధీనం చేసుకుంటారని అడిగానని చెప్పారు. దీంతో మాఫియా సభ్యులు తనకు కొన్ని కాగితాలను చూపించారని, వెంటనే తాను అక్కడ ఉన్నవారిని ఉద్దేశించి, వీళ్ళని (మాఫియాను) చావగొట్టండి అని చెప్పానని పేర్కొన్నారు.
ఈ రెండు సంఘటనలతో పాటు ఇలాంటి అనేక సంఘటనలు తనను రాజకీయాల్లో చేరే విధంగా చేశాయని చెప్పారు. ఇప్పుడు ఉత్తర ప్రదేశ్‌లో ఇటువంటి పనులు ఎవరూ చేయలేరని ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. చట్టవిరుద్ధంగా దేన్ని అయినా ఆక్రమించుకోవాలని క్రిమినల్స్ ఎవరైనా ప్రయత్నిస్తే, బుల్డోజర్లను ఎదుర్కొనవలసి వస్తుందని వారికి తెలుసునని తేల్చి చెప్పారు.
మాఫియాపై తన అణిచివేత ‘ఒకవైపు’ ఉందనే ఆరోపణలపై యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ, మాఫియా అనేడిది కులం, మతం, మతం లేదా రాజకీయాలతో ముడిపడి ఉండదని స్పష్టం చేశారు. వారెవరైనా సరే, వారు సమాజానికి ఘోర శత్రువులని, కరోనావైరస్ కంటే ప్రమాదకారులని తేల్చి చెప్పారు.
యుపి ఎన్నికలు తన పనికి రెఫరెండంగా మారడం పట్ల తానేమి అయోమయం చెందడం లేదని చెబుతూ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి 350 సీట్లకు పైగా వస్తాయని ఆదిత్యనాథ్ విశ్వాసం వ్యక్తం చేశారు.