అవిశ్వాస తీర్మానం పై లోక్‌సభలో చర్చ మంగళవారం ప్రారంభమైంది. మూడు రోజుల పాటు చర్చ కొనసాగనున్నది. మణిపూర్ అంశంపై ప్రధాని మోడీ మౌనం వహించారని విపక్షాలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఈరోజు చర్చ మొదలుపెట్టారు.
కాంగ్రెస్ పార్టీ నేత గౌరవ్ గగోయ్ ఆ చర్చను ప్రారంభించారు. నిజానికి ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ చర్చను ఆరంభిస్తారని ఆశించినా ఆయన ముందుగా ఆ అంశంపై మాట్లాడలేదు. గౌరవ్ గగోయ్ మాట్లాడుతూ బలవంతంగా అవిశ్వాస తీర్మానాన్ని తీసుకురావాల్సి వచ్చిందని, ఇది సంఖ్యా బలానికి చెందిన విషయం కాదు అని, మణిపూర్‌కు న్యాయం చేయాలన్నదే తమ ఉద్దేశమని చెప్పారు.
ప్రభుత్వంపై అవిశ్వాసాన్ని వ్యక్తం చేయడం కోసమే తాము తీర్మానాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. మణిపూర్ కోసం ఈ తీర్మానం తెచ్చామని చెబుతూ మణిపూర్‌కు న్యాయం జరగాలని కోరారు. పార్లమెంట్లో మాట్లాడరాదు అని ప్రధాని మోదీ మౌనవ్రతం చేపట్టారని, పేర్కొంటూఆయన మౌనాన్ని బ్రేక్ చేసేందుకే ఈ తీర్మానాన్ని తీసుకువచ్చామని స్పష్టం చేశారు.
ప్రధాని మోదీ మణిపూర్‌లో పర్యటించాలని.. తన నేతృత్వంలో అఖిలపక్ష బృందాన్ని అక్కడికి తీసుకెళ్లాలని.. ఆ రాష్ట్రంలోని వివిధ సంస్థలతో చర్చలు జరిపి, అక్కడ శాంతిని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. 2002లో గుజరాత్లో గోధ్రా అనంతర అల్లర్ల వేళ నాటి ప్రధాని వాజ్‌పేయి గుజరాత్‌ను సందర్శించారని గొగోయ్ గుర్తుచేశారు.
మణిపూర్‌లో తిరిగి శాంతిని నెలకొల్పేందుకు ప్రధాని చర్యలు చేపడతారని తాము ఆశిస్తుంటే.. ఆయన విపక్ష కూటమి ‘ఇండియా’ను విమర్శించడంలో బిజీగా ఉన్నారని గొగోయ్ దుయ్యబట్టారు. ప్రధానిని మూడు ప్రశ్నలు అడగాలని ఉందని చెబుతూ ఇప్పటి వరకు ఆయన ఎందుకు మణిపూర్‌ను విజిట్ చేయలేదని, 80 రోజుల తర్వాత ఆ అంశంపై కేవలం 30 సెకన్లు మాట్లాడారని, ఎందుకు ఆయన ఇంత సమయాన్ని తీసుకున్నారని, మణిపూర్ సీఎంను ఎందుకు ఇంత వరకు తొలగించలేదని గౌరవ్ గగోయ్ ప్రశ్నించారు.
ప్రధాని మోదీ ప్రపంచ నేతగా ఎదిగారని.. 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారే క్రమంలో పురోగమిస్తోందని.. ఇలాంటి వేళ అవిశ్వాసం పెట్టాల్సిన అవసరమే లేదని కేంద్రమంత్రి రిజిజు తేల్చి చెప్పారు. తమ కూటమికి ఇండియా పేరు పెట్టుకున్న ప్రతిపక్షాలు దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని మండిపడ్డారు.
తమ ప్రభుత్వం ఏర్పాటైన కొత్తల్లో ప్రధాని మోదీ ఒక బృందాన్ని ఏర్పాటు చేసి, ప్రతి 15 రోజులకు ఒకసారి ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటించాల్సిందిగా ఆదేశించినట్టు రిజిజు తెలిపారు. అది ఇప్పటికీ కొనసాగుతోందన్నారు. దీనిపై కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ స్పందిస్తూ.. గత 97 రోజుల్లో ఎంతమంది మంత్రులు మణిపూర్‌లో పర్యటించాలో చెప్పాలని నిలదీశారు.
ఈ అంశంపై మాట్లాడేందుకు భారత రాష్ట్ర సమితికి 12 నిమిషాల సమయాన్ని కేటాయించారు. బిజెపికి 6 గంటల 41 నిమిషాలు కేటాయించారు. చర్చకు మొత్తం 16 గంటల సమయం కేటాయించారు. దాంట్లో కాంగ్రెస్ పార్టీకి గంటా 9 నిమిషాలు కేటాయించినట్లు తెలుస్తోంది.