శనివారం తెల్లవారుజామున 3 గంటలకు జమ్మూ కాశ్మీర్లోని మాతా వైష్ణో దేవి మందిరం వద్ద జరిగిన తొక్కిసలాటలో కనీసం పన్నెండు మంది యాత్రికులు మరణించారు. డజనుకు పైగా మంది గాయపడ్డారు.
13 మందికి తీవ్ర గాయాలు కాగా నారాయణ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతుల్లో ఇప్పటివరకు ఎనిమిది మందిని గుర్తించారు – ధీరజ్ కుమార్ (26), శ్వేతా సింగ్ (35), వినయ్ కుమార్ (24), సోను పాండే (24), మమత (38), ధరమ్వీర్ సింగ్ (35), వనీత్ కుమార్ (38) , మరియు డాక్టర్ అరుణ్ ప్రతాప్ సింగ్ (30).
అధికార వర్గాల కధనం ప్రకారం, భవన్ ప్రాంతంలో భారీ రద్దీని నియంత్రించడానికి పోలీసులు తేలికపాటి లాఠీచార్జిని ఆశ్రయించడంతో తొక్కిసలాట జరిగింది. 25,000 మందికి పైగా కత్రా నుండి బయలుదేరి పవిత్ర పుణ్యక్షేత్రం వైపు వెళ్లేందుకు అనుమతించినట్లు ఆ వర్గాలు తెలిపాయి.
ఈ ఘటనపై జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నేతృత్వంలో జమ్మూ ఏడీజీపీతో సహా ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. మృతుల బంధువులకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా, గాయపడిన వారి చికిత్సకు అయ్యే ఖర్చును దేవస్థానం బోర్డు భరిస్తుంది.
జమ్మూకశ్మీర్ వైష్ణోదేవీ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు.తొక్కిసలాటలో మృతులకు ప్రధాని మోదీ సంతాపం తెలిపారు.
“మాతా వైష్ణో దేవి భవన్లో తొక్కిసలాట కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి బంధువులకు ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి నుండి ఒక్కొక్కరికి రూ. 2 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ఇవ్వబడుతుంది. క్షతగాత్రులకు రూ.50,000 అందజేస్తాం” అంటూ ట్వీట్ చేశారు. .
వైష్ణో దేవి పుణ్యక్షేత్రం బోర్డు మృతుల బంధువులకు ఒక్కొక్కరికి రూ.25,000 చొప్పున ఎక్స్గ్రేషియాను ప్రకటించింది. తొక్కిసలాటతో ఆగిపోయిన యాత్ర తిరిగి ప్రారంభమైంది.