ఫోన్ ట్యాపింగ్ ద్వారా మొబైల్ ఫోన్ వినియోగదారులకు సంబంధించిన డేటాను తస్కరించే చర్యల నుంచి రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని రాజ్యసభలో బుధవారం వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఇటీవల కాలంలో ఫోన్ ట్యాపింగ్ ఉదంతాలు అనేకం వెలుగుచూస్తున్న నేపధ్యంలో దీనిని అరికట్టేందుకు పటిష్టమైన చర్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు.
డేటా ప్రొటెక్షన్ బిల్లుపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ ఒక వ్యక్తి మొబైల్ ఫోన్‌ను ట్యాప్ చేయాలంటే సర్వీసు ప్రొవైడర్ లేదా మొబైల్ టవర్ సహాయం అవసరం లేకుండా మొబైల్ ఫోన్లోని స్పీకర్, కెమెరా ద్వారా సంభాషణలను ట్యాప్ చేయడం, ఆ ఫోన్లోని డేటాను తస్కరించే సామర్ధ్యంతో అనేక విదేశీ కంపెనీలు సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చాయని చెప్పారు.
ఫోన్ ట్యాపింగ్ సాఫ్ట్‌వేర్‌ను కేవలం ప్రభుత్వాలకు, ప్రభుత్వ విభాగాల వినియోగానికి మాత్రమే విక్రయించాలన్న షరతు ఉందని, ఈ సాఫ్ట్వేర్ 50 నుంచి 100 కోట్ల రూపాయలకు విక్రయిస్తారని, వార్షిక నిర్వహణ కోసం ఆ మొత్తంలో 20 శాతం చెల్లించాల్సి ఉంటుందని ఆయన వివరించారు.
కొన్ని ప్రైవేట్ సంస్థలు ఈ సాఫ్ట్‌వేర్‌ను అక్రమంగా సంపాదించి ఫోన్ ట్యాపింగ్‌కు వినియోగిస్తున్నాయని, ప్రభుత్వాలు లేదా ప్రభుత్వ విభాగాలు వినియోగించే ఈ సాఫ్ట్‌వేర్‌ను కొన్ని ప్రైవేట్ సంస్థలు చేజిక్కించుకుని దుర్వినియోగానికి పాల్పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.