జనసేన అధినేత పవన్ కల్యాణ్ మూడో విడత వారాహి యాత్ర గురువారం నుంచి విశాఖలో ప్రారంభంకానుంది. అయితే పవన్ వారాహి యాత్రపై పోలీసులు ఆంక్షలు విధించారు. కొన్ని నిబంధనలతో యాత్రకు అనుమతి ఇస్తామని తేల్చేశారు. నగరంలో ఎలాంటి ర్యాలీలు నిర్వహించకూడదని, ఎయిర్ పోర్టు నుంచి ర్యాలీగా రాకూడదని పోలీసులు ఆంక్షలు విధించారు.
వాహనంపై నుంచి అభిమానులకు అభివాదాలు చేయవద్దని స్పష్టం చేశారు. విశాఖ జగదాంబ జంక్షన్ లో పవన్ బహిరంగ సభకు పోలీసులు అనుమతి ఇచ్చారు. అయితే భవనాలపైకి అభిమానులు ఎక్కకుండా చూసుకోవాలని, ఆ బాధ్యత జనసేనదేనని పేర్కొన్నారు. పోలీసుల ఆంక్షలను ఉల్లంఘిస్తే బహిరంగసభకు అనుమతి తీసుకున్న వారిదే బాధ్యత అని స్పష్టం చేశారు.
పోలీసుల ఆంక్షల జనసైనికులు మండిపడుతున్నారు. వైసీపీ నేతల ఒత్తిడితో పోలీసులు ఆంక్షలు విధించారని ఆరోపిస్తున్నారు. మరోవంక, పవన్ కల్యాణ్ వారాహి యాత్రలో గజమాలలు వద్దంటూ జనసేన అభిమానులకు సూచించింది. భద్రతా కారణాల దృష్ట్యా నాయకులు, శ్రేణులు గజమాలలు ఏర్పాటుచేయొద్దని కోరింది.
పవన్ కల్యాణ్ భద్రత దృష్టిలో ఉంచుకోవాలని హెచ్చరించారు. విశాఖ వేదికగా మూడో విడత పవన్ వారాహి యాత్ర గురువారం నుంచి ప్రారంభం కానుంది. వారాహి విజయ యాత్రలో, సభా వేదికల వద్ద క్రేన్లతో భారీ దండలు, గజమాలలు వేయడం వంటి కార్యక్రమాలు ఎట్టి పరిస్థితుల్లోనూ చేపట్టవద్దని కోరింది.
యాత్ర మార్గంలో భారీ క్రేన్లు, వాహనాలు ఏర్పాటు చేయడంతో వాహన శ్రేణి ముందుకు సాగడం లేదని, దీంతో పవన్ వ్యక్తిగత భద్రతకు భంగం కలిగి అవకాశం ఉందని పేర్కొంది. నిబంధనలు పాటిస్తూ వారాహి విజయ యాత్రను విజయవంతం చేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సహకరించాలని జనసేన కోరింది.
పవన్ కళ్యాణ్ ఈరోజు మధ్యాహ్నం వైజాగ్ చేరుకుంటారు. సాయంత్రం 5 గంటలకు జగదాంబ జంక్షన్ వద్ద వారాహి వాహనం పై నుండి పవన్ ప్రసంగిస్తారు. ఈ నెల 19 వరకూ పవన్ ఉమ్మడి విశాఖ జిల్లాలోనే పర్యటిస్తారు. ఆగస్టు 15న మాత్రం మంగళగిరిలో జెండా వందనం చేస్తారు. మూడో విడత వారాహి యాత్రలో విశాఖ జిల్లాలోని అర్బన్ సమస్యలపై పవన్ దృష్టి పెట్టనున్నారు. ఈ పది రోజుల్లో జనవాణి, బహిరంగ సభలు, వారాహిపై నుండి ప్రసంగాలు ఉంటాయి.