మహిపూర్‌లో హింసను కాంగ్రెస్ రాజకీయం చేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. ఈ అంశంపై చర్చించడానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగానే ఉందని స్పష్టం చేశారు. లోక్‌సభలో అవిశ్వాసతీర్మానంపై బుధవారం రెండో రోజు చర్చ సందర్భంగా అమిత్‌షా మాట్లాడుతూ మణిపూర్‌లో హింస తగ్గుముఖం పడుతూ ఉందని అంటూ అగ్నికి ఆజ్యం పోయవద్దని విపక్షాలకు హితవు చెప్పారు.
‘మణిపూర్‌లో జాతుల మధ్య ఘర్షణలు జరిగాయన్న విపక్షాల వాదనలతో నేను అంగీకరిస్తున్నాను. మణిపూర్‌లో హింస సిగ్గుచేటు. అయితే దాన్ని రాజకీయం చేయడం మరింత సిగ్గుచేటు’ అని మణిపూర్ ఘర్షణలపై మాట్లాడుతూ అమిత్ షా ధ్వజమెత్తారు. మణిపూర్‌లో రాజకీయం చేయడానికే రాహుల్ గాంధీ అక్కడికి వెళ్లారని అమిత్ షా విమర్శించారు.
హెలికాప్టర్ ద్వారా చురచంద్‌పూర్ వెళ్లాలని తాము ఆయనకు చెప్పామని, అయితే ఆయన అందుకు నిరాకరించి రోడ్డు మార్గం ద్వారా వెళ్లడానికి, అందుకే పోలీసులు ఆయనను అడ్డుకున్నారని చెప్పారు. మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు తనను ఎంతగానో బాధించాయని చెబుతూ అక్కడ జరిగిన ఘరణల్లో 152 మంది మరణించారని వెల్లడించారు.
ఈ ఘర్షణలకు సంబంధించి 14,898 మంది అరెస్టయ్యారని, 1,106 కేసులు నమోదయ్యాయని తెలిపారు. మణిపూర్‌లో ఇద్దరు మహిళలను వివస్త్రలుగా చేసి ఊరేగించిన వీడియోను కొందరు వైరల్ చేశారని చెబుతూ ఈ వీడియో వెలుగులోకి వచ్చాక చర్యలు తీసుకున్నామని చెప్పారు.
మయన్మార్, మిజోరాంలనుంచి వేలాదిమంది కుకీ ఆదివాసీలు మణిపూర్‌లోకి వస్తున్నారని, ఇది వేరే వర్గాల్లో అభద్రతాభావానికి కారణమయిందని పేర్కొంటూ ఇదే అల్లర్లకు ప్రధాన కారణమని స్పష్టం చేశారు. మణిపూర్‌లో యుపిఎ హయాంలో కూడా రెండు తెగల మధ్య ఘర్షణలు జరిగాయని చెప్పారు.
1993లో జరిగిన ఘర్షణల్లో 700 మందికి పైగా చనిపోయారని, అప్పట్లో ఏడాదిన్నర పాటు హింస కొనసాగిందని చెప్పారు. గతంలో చాలా సందర్భాల్లో సహాయమంత్రులే దీనిపై లోక్‌సభలో సమాధానాలు ఇచ్చారని, ఇప్పుడు మాత్రం ప్రధానమంత్రి సమాధానం చెప్పాలని విపక్షాలు ఉభయసభలును స్తభింపజేస్తున్నాయని అమిత్ షా మండిపడ్డారు.
మే 3 వరకు మణిపూర్‌లో కర్ఫూ విధించాల్సిన అవసరం రాలేదని చెబుతూ మణిపూర్‌లో ఆరేళ్లుగా బిజెపి ప్రభుత్వం ఉందని, అక్కడ ఉగ్రవాదుల హింసాకాండను అంతమొందించిందని తెలిపారు. మణిపూర్‌లో ఘటనల నేపథ్యంలో సిఎస్, డిజిపిలను బదిలీ చేశామని వివరించారు.
సిఎం బీరేన్ సింగ్‌ను ఎందుకు తొలగించలేదని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయని చెబుతూ సిఎం సహకరిస్తున్నందునే ఆయనను తొలగించలేదని అమిత్ షా వెల్లడించారు. రాష్ట్రంలో పరిస్థితులు క్రమేపీ కుదుట పడుతున్నాయని చెప్పారు. మణిపూర్‌లో తాను మూడు రోజుల పాటు ఉండి పరిస్థితులను సమీక్షించానని పేర్కొన్నారు.
కేంద్ర సహాయ మంత్రి 23 రోజులు అక్కడే ఉన్నారని చెప్పారు.‘మొదటి నుంచీ మణిపూర్ అంశంపై చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అయితే ప్రతిపక్షాలకు చర్చ అవసరం లేదు. వాళ్లకు నిర్మాణాత్మకమైన చర్చకన్నా గొడవ ముఖ్యం. ప్రతిపక్షాలు నేను మాట్లాడడం ఇష్ట లేదు. అయితే వాళ్లు నానోరు మూయించలేరు. 130 కోట్ల మంది మమ్మల్ని ఎన్నుకున్నారు. అందువల్ల వాళ్లు మేం చెప్పేది వినాలనుకుంటున్నారు’ అని అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు.
పరిస్థితులు చక్కబడడానికి మెయితీలు, కుకీలు ప్రభుత్వంలో సహకరించాలని ఈ సందర్భంగా అమిత్ షా విజ్ఞప్తి చేశారు. రెండు తెగలతోను చర్చలు జరుపుతున్నామని చెప్పిన అమిత్ షా చర్చలతోనే సమస్యకు పరిష్కారం లభిస్తుందని భరోసా వ్యక్తం చేశారు.
హింసను విడనాడి ప్రభుత్వంతో చర్చలు జరపాలని ఇరువర్గాలను చేతులు జోడించి వేడుకుంటున్నానని చెప్పారు. దాదాపు రెండు గంటల పాటు అమిత్ షా ప్రసంగించిన అనంతరం లోక్‌సభ గురువారానికి వాయిదా పడింది. గురువారం అవిశ్వాస తీర్మానంపై చర్చకు ప్రధాని మోదీ సమాధానమిస్తారు.