ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయంలో వెలుగులోకి వచ్చిన డిజిటల్ సంతకాల దుర్వినియోగం కేసు కలకలం రేపుతోంది. ఈ కేసుకు సంబంధించి ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు సైబర్ క్రైమ్ సిఐడి ఎస్పీ హర్ష వర్ధన్ రాజు తెలిపారు. శనివారం ఎస్పీ మాట్లాడుతూ కొందరు కార్యదర్శుల డిజిటల్ సంతకాలను దుర్వినియోగం చేశారనీ, ‘సీఎం పిటిషన్’లు జారీ చేశారనీ తెలిపారు.
ఒక్కో ఫైల్‌కు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకూ వసూలు చేశారని చెప్పారు. ఏప్రిల్ నుంచి 3 నెలలలో 66 సీఎంపీలు జారీ చేసిన నిందితులు.. మొత్తం రూ.15 లక్షల వరకూ వసూలు చేశారనీ, అయితే, ఏ దస్త్రానికి కూడా తుది ఆమోదం రాలేదని తెలిపారు. ఈ వ్యవహారంపై తదుపరి విచారణ చేపట్టామని వివరించారు.
ఈ విషయంపై సీఎంవో అధికారుల నుంచి వచ్చిన ఫిర్యాదుతో ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. సీఎంవోలోని రేవు ముత్యాల రాజు, ధనుంజయ్ రెడ్డి, సీఎస్ జవహర్ రెడ్డి పేషీల్లో పనిచేస్తున్న కొందరు డిజిటల్ సంతకాలు దుర్వినియోగం చేశారు. ఈ కేసులో కనమర్ల శ్రీను, గుత్తుల సీత రామయ్య, నలజల సాయి రామ్, భూక్యా చైతన్య నాయక్, అబ్దుల్ రజాక్ అరెస్టు చేసినట్లు సీఐడీ ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు.
ఫిబ్రవరి నెలలో ముత్యాలరాజు పేషీలో పని చేస్తున్న డీఈవో కనమర్ల శ్రీను తయారు చేసిన హోండిపార్ట్మెంట్ కి చెందిన ఒక సీఎం పిటిషన్ ధనుంజయ్ రెడ్డి పేషీకి రాగా దానిపై అనుమానంపై క్రాస్ చెక్ చేశారు. అయితే ఈ పని కనమర్ల శ్రీను చేశాడని, శాఖపరమైన విచారణ చేసి నిర్ధారించుకుని అతనిని ఉద్యోగం నుంచి తొలగించారు.
ఉద్యోగంలో నుంచి తొలగించిన తర్వాత కూడా శ్రీను ముత్యాలరాజు పేషీలో పని చేసే డీఈవో చైతన్య సహకారంతో లాగిన్ పాస్ వర్డ్ తెలుసుకుని మరో మూడు సీఎంపీలను ఈ-ఆఫీసు లాగిన్ నుంచి వివిధ శాఖలకు పంపాడు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు ఆ ఫైల్స్ ను వెనక్కి తీసుకున్నారు.
ఈ పని శ్రీను చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించుకుని, మిగిలిన కార్యదర్శలు వారి శాఖలలోని లాగిన్స్ చెక్ చేసుకోగా సుమారుగా 66 సీఎంపీలు ఫేక్ అని గుర్తించి రిపోర్ట్ తయారు చేసి సీఐడీ అధికారులు ఇచ్చారు. ఏపీ సీఐడీ విచారణలో ఐదుగురు నిందితులను గుర్తించారు. ఒకరితో ఒకరికి సంబంధాలు ఉన్నాయని అదే విధంగా ఫైల్ ప్రాసెసింగ్ కి వీళ్ల మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు గుర్తించామని సీఐడీ ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు.