కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి నడకదారిలో వచ్చే భక్తుల విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆంక్షలు అమలులోకి తీసుకు వచ్చింది. ఇటీవల కుటుంబ సభ్యులతో కలిసి స్వామి దర్శనం కోసం నడకదారిలో వెళ్తున్న చిన్నారిపై చిరుత దాడి చేయడంతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భక్తుల భద్రత విషయంలో టీటీడీ అప్రమత్తమైంది.
అయితే, మొక్కుబడి నేపథ్యంలో చాలా మంది భక్తులు నడకదారిన వెళ్తుంటారు. చిరుత దాడి ఘటన నేపథ్యంలో కొత్తగా భక్తుల భద్రతను దృష్టిలో పెట్టుకొని ఆంక్షలు తీసుకువచ్చింది. అలిపిరి–తిరుమల మార్గంలో ఇకపై వంద మంది భక్తులను ఒక్కో బృందంగా దర్శనానికి తరలించాలని నిర్ణయించింది.
అలాగే వారికి రక్షణగా ముందు వెనుకలా రోప్, సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేసింది. అలాగే మధ్యాహ్నం 2 గంటల తర్వాత 15 సంవత్సరాలలోపు పిల్లలకు అనుమతి నిలిపివేసింది. 15 ఏళ్లపై బడిన భక్తులను మాత్రం అలిపిరి కాలిబాట మార్గంలో ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10గంటల వరకు.. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అనుమతించనున్నట్లు టీటీడీ పేర్కొంది.
మరో వైపు పోలీసులు ఏడో మైలు వద్ద పోలీసులు పిల్లల చేతికి ట్యాగ్‌లను సైతం వేస్తున్నారు. తల్లిదండ్రులు పిల్లలు తప్పిపోతే కనిపెట్టేందుకు ట్యాగ్‌లను వేస్తున్నట్లు తెలిపారు. ట్యాగ్‌పై పిల్లల పేర్లు, తల్లిదండ్రుల వివరాలు, ఫోన్ నంబర్, పోలీస్ టోల్ ఫ్రీ నంబర్లను అందులో ఉంచుతున్నారు.
రెండవ ఘాట్ రోడ్డులో చిరుత సంచారం నేపథ్యంలో నడకదారిలో సాయంత్రం వేళ భక్తులను అనుమతించడంపై టీటీడీ పునరాలోచనలో పడింది. ఇప్పటికే ఘాట్ రోడ్డులో సాయంత్రం వేళ ద్విచక్ర వాహనాల రాకపోకలను టీటీడీ నిషేదించింది.
జంతువులు వస్తే దూరంగా తరిమేందుకు అవసరమైన లైటింగ్ సిస్టం, సౌండింగ్ సిస్టంలను సిద్ధం చేస్తున్నారు. క్రూరమృగాల సమస్య పరిష్కారమయ్యే వరకు టిటిడి తీసుకున్న నిర్ణయాలకు యాత్రికులు సహకారం అందించాలని టిటిడి విజ్ఞప్తి చేసింది. కాలినడక మార్గాలు, ఘాట్లలో యాత్రికుల భద్రత దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలపై సోమవారం టిటిడి ఛైర్మన్ శ్రీ భూమనకరుణాకర్ రెడ్డి తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు.