ఆగస్ట్ 15న ఢిల్లీలోని బహిరంగ ప్రదేశాలు, భద్రతా సంస్ధలే లక్ష్యంగా పాకిస్తాన్కు చెందిన లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్ర సంస్ధలు విధ్వంస కుట్రకు తెరలేపాయనే వార్తలు కలకలం రేపాయి. దేశ రాజధాని ప్రాంతంలోని రైల్వే స్టేషన్లు, విదేశీ సంస్ధలు సహా బహిరంగ ప్రదేశాల్లో దాడులకు ఉగ్ర సంస్ధలు టార్గెట్గా ఎంచుకున్నాయని వార్తా కధనాలు వెల్లడించాయి.
ప్రముఖ రోడ్లు, రైల్వే ఆస్తులు, ఢిల్లీ పోలీసుల కార్యాలయాలు, ఎన్ఐఏ ప్రధాన కార్యాలయం వంటి లక్ష్యాలను లష్కరే, జైషేలు ఉగ్ర దాడుల కోసం ఎంచుకున్నాయని తెలిసింది. ఉగ్ర సంస్ధల కుట్ర సమాచారం వెల్లడికావడంతో నిఘా సంస్ధలు అప్రమత్తమయ్యాయి.
నిఘా సంస్ధల హెచ్చరికలతో ఢిల్లీ అంతటా భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేయడంతో నగరవ్యాప్తంగా ఢిల్లీ పోలీసులు ముమ్మరంగా పెట్రోలింగ్ చేపట్టి వాహనాలను తనిఖీ చేస్తున్నారు.
దాదాపు 10000 మంది పోలీసులు బందోబస్తు విధుల్లో ఉండగా, వేయి ఫేషియల్ రికగ్నైజేషన్ కెమెరాలు, యాంటీ డ్రోన్ సిస్టమ్లు, ఇతర నిఘా పరికరాలను రంగంలోకి దించారు. 15న ప్రధాని జాతిని ఉద్దేశించి ప్రసంగించే ఎర్రకోట పరిసర ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు.
భారత 77వ స్వాతంత్ర్య దినోత్సవంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం ఢిల్లీలోని ప్రఖ్యాత ఎర్రకోటపై మువ్వన్నెల జెండాను ఎగురవేయనున్నారు. ఈ వేడుకల కోసం వివిధ వృత్తులకు చెందిన సుమారు 1800 మంది వ్యక్తులు, వారి జీవిత భాగస్వాములను కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించింది.
ఈ ప్రత్యేక అతిథుల జాబితాలో 660 గ్రామాలకు చెందిన 400 మంది సర్పంచ్లు ఉన్నారు. రైతు ఉత్పత్తిదారుల సంస్థల పథకంలో భాగమైన వారిలో 250 మంది, ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం నుంచి 50 మంది, ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజనలో మరో 50 మందికి ఆహ్వానం లభించింది.
కొత్త పార్లమెంట్ భవనం సహా సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగమైన 50 మంది నిర్మాణ కార్మికులు, ఖాదీ కార్మికులు, సరిహద్దు రోడ్ల నిర్మాణం, అమృత్ సరోవర్, హర్ ఘర్ జల్ యోజన తయారీలో భాగమైన 50 మంది చొప్పున వేడుకలకు హాజరు కానున్నారు.
అలాగే 50 మంది చొప్పున ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు, నర్సులు, మత్స్యకారులకు కూడా ఎర్రకోటలో స్వాతంత్ర్య దినోత్సవంలో పాల్గొనే అవకాశం లభించింది. కాగా, ప్రభుత్వ జన్ భగీదరి దార్శనికతకు అనుగుణంగా ఇలాంటి సామాన్య ప్రజలను స్వాతంత్ర్య దినోత్సవ వేడులకు ఆహ్వానించినట్టు రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతం నుంచి 75 మంది దంపతులను తమ సంప్రదాయ దుస్తులలో ఎర్రకోటలో జరిగే వేడుకను చూసేందుకు ఆహ్వానించారు.